
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగించాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, పాలక మండలి సభ్యులు రంగారెడ్డి, మంజులారెడ్డి, భూపాల్‌రావు, బక్కన్నయాదవ్, భీంరెడ్డి, వెంకటేష్‌గుప్తా, వంశీచంద్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా సంతకాల సేకరణ చేపట్టారు.
● ఇదిలా ఉండగా.. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి ముగియగానే ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మాత్రం మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్ని ఆరు నెలల కాలపరిమితితో పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ సంప్రదాయంగా కొనసాగుతుంది. గత మూడు దశాబ్దాలుగా పీఏసీఎస్ పదవీకాలం ముగిసిన రెండేళ్ల వరకు ఎన్నికలు జరగకపోయినా ప్రతి ఆరునెలలకు ఒకసారి పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న 9 డీసీసీబీ బ్యాంకుల్లో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండటంతోపాటు వాణిజ్యపరంగా మంచి అభివృద్ధి సాధించాయి. అందుకే అధికారుల ఇన్‌చార్జి పాలనలో కొనసాగే కంటే ఉన్న పాలక వర్గాలను కొనసాగించాలని కోరుతూ అన్ని ఉమ్మడి జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్ల అధ్యక్షతన సమావేశం నిర్వహించి వినతిపత్రాలు అందించాలనే రాష్ట్రంలోని ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ల నిర్ణయంలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఒక్క పాలమూరు జిల్లాలోనే కాకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల డీసీసీబీ బ్యాంకుల్లో వాటి పర్యవేక్షణలో పనిచేసే పీఏసీఎస్‌ల చైర్మన్లు తమ సొసైటీల అభివృద్ధికి సంపూర్ణంగా సేవలు చేస్తున్నందున ఈ పాలక వర్గాలనే కొనసాగించాలని పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌గౌడ్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment