
నాణ్యమైన విద్యుత్ అందించాలి
నారాయణపేట: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగినా.. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ నాణ్యమైన విద్యుత్ అందజేయాలని సీజీఎం ప్రభాకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళికలో భాగంగా వేసవిలో పెరిగే విద్యుత్ వాడకం తట్టుకొనే విధంగా అదనంగా ట్రాన్‌న్స్‌ఫార్మర్ల కోసం రూ.4 కోట్లు, 11 కేవీ లైన్ నిర్మాణం కోసం రూ.80 లక్షలు, 33 కేవీ లైన్ ఏర్పాటుకు రూ.30 లక్షలు, నూతన డీటీఆర్‌కు రూ.4.5 లక్షలు ప్రణాళికలను రూపొందించారన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సరఫరా చేసేలా వనరులు సమకూర్చుకోవాలన్నారు. 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాల పనితీరును పర్యవేక్షించటం, నియంత్రికల ఓవర్ లోడ్ లేకుండా నూతన వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే 11 కేవీ విద్యుత్ తీగల అధిక లోడ్ లేకుండా విద్యుత్ నియంత్రికలు అవసరమైన చోట మార్చుటకు ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సంజీవరెడ్డి, డీఈ శ్రీనివాస్, డీఈటీ జితేందర్, నర్సింహ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment