జిల్లాలో ఎరువుల కొరత లేదు
నారాయణపేట: జిల్లాలో ఎరువుల కొరత లేదని, 5వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌సుధాకర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు.. రాష్ట్రంలో పలుచోట్ల యూరియా లేదని, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కానీ జిల్లాలో ఎరువులకు ఎలాంటి ఢోకా లేదన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 1.54 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు, ప్రధానంగా 1.36 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని అన్నారు. అయితే ప్రతి ఏటా యాసంగిలో 40 నుంచి 60 శాతమే సన్నరకాలు సాగుచేసేవారని, ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో ఈ ఏడాది సన్నరకాలు 80 శాతం సాగు చేశారని వివరించారు. ఇదిలాఉండగా, జిల్లాకు 7 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేశామని, 5 వేల మెట్రిక్ టన్నులు వినియోగించారని, మరో 5వేల మెట్రిక్ టన్నులు అంచనాకు మించి స్టాక్ ఉందని వివరించారు. డీఏపీ 5 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 7 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వాడారని, ఇంకా నిల్వలు మిగిలి ఉన్నాయని డీఏఓ జాన్‌సుధాకర్ వివరించారు.
అందుబాటులో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా
జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్
Comments
Please login to add a commentAdd a comment