వేతనాలు అందక వెతలు
నారాయణపేట
శనివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వివరాలు 8లో u
నారాయణపేట: జిల్లా ప్రభుత్వ దవాఖానాలో విధులు నిర్వర్తిస్తున్న ఐసీయూ సిబ్బందికి ఆర్నెళ్లుగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో నానా ఆవస్థలు పడుతున్నారు. టీవీవీపీ కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నప్పుడు గతేడాది జూలై వరకు వేతనాలు వారి అకౌంట్‌లో జమ అయ్యాయి. ఆ తర్వాత రెగ్యూలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ఇటు తెలంగాణ వైద్య విధాన పరిషత్, అటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెండింగ్ వేతనాల చెల్లింపు బాధ్యత మాది కాదంటే మాది కాదంటూ జాప్యం చేస్తున్నాయి. దీంతో ఆ రెండు శాఖల మధ్య వైద్య ఉద్యోగులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలను చెల్లించాలని వేడుకుంటున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖానాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సిబ్బంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 20 మంది పని చేస్తున్నారు. వారిలో జిల్లా ప్రభుత్వ దవాఖానాలోని ఐసీయూ విభాగంలో రేడియా గ్రాఫర్ 1, ల్యాబ్‌టెక్నిషన్ 1 , ఎఫ్‌ఎన్‌ఓ/ఎంఎన్‌ఓ 8 , సెక్యూరిటీ గార్డ్స్ 3, వెంటిలేటర్ టెక్నీషియన్ 1, స్టాఫ్ నర్సులు ఆరుగురు పని చేస్తున్నారు. అందులో రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సులకు రూ.22,750, మిగతా వారికి రూ.13,500 వేతనాలు చెల్లించాల్సి ఉంది.
మెడికల్ కాలేజీ ప్రారంభంతో..
గత అక్టోబర్ నెలాఖరులో నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ దవాఖానా అటు వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), ఇటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎం ఈ) పరిధిలో నిర్వహణ కొనసాగుతుంది. టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా ప్రభుత్వ దవాఖానను టీచింగ్ ఆసుపత్రిగా మారుస్తూ డీఎంఈ పరిధిలోకి తీసుకురావడం, ఆసుపత్రిలో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మెడికల్ కాలేజీ ప్రారంభంకాక ముందు రెండు నెలల బకాయి ఉండగా, మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యాక నాలుగు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది.
నల్లబ్యాడ్జీలతో నిరసన
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం ఐసీయూ సిబ్బంది నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టాల్సి ఉంటుందని, ఇకపైన ఏం జరిగిన సంబంధిత ఆధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిబ్బంది హెచ్చంచారు.
రెండు శాఖల మధ్య..
తమ వేతన బకాయిల విషయమై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీవీవీపీ అధికారులను అడిగితే ఆసుపత్రి డీఏంఈ పరిధిలోకి మారినందున వేతనాలు ఆ శాఖనే చెల్లిస్తుందని చెబుతున్నారని తెలిపారు. ఇటు డీఎంఈ అధికారులను అడిగితే ఆసుపత్రి తమ శాఖ పరిధిలోకి మారినట్టు తమకు ఇంకా అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను వైద్య విధాన పరిషత్ కమిషనర్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లామని, ఇంత వరకు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో జిల్లా ఆస్పత్రి సిబ్బంది
రెండు శాఖల మధ్య నలుగుతున్న వైనం
ఆర్నెళ్లుగా అందని వేతనాలు
నల్ల బ్యాడ్జీలతో నిరసన
వేతనాలు అందక వెతలు
Comments
Please login to add a commentAdd a comment