అపార్‌కు ఆటంకాలు
మరికల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) గుర్తింపు కార్డు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుంది. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదివి విద్యార్థులకు అందజేయనున్నారు. ఇది విద్యార్థి జీవితకాలం గుర్తింపుకార్డుగా ఉపయోగపడే ఈ కార్డుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 678 పాఠశాలలు ఉండగా ఈ నెల 17 నాటికి కేవలం 31.54 శాతం మాత్రమే పూర్తి చేసుకుంది. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 45 శాతం పూర్తి చేయగా.. అత్యల్పంగా నర్వ మండలంలో 21 శాతం నమోదైంది. విద్యార్థులు ఉన్నత చదువులకు 12 అంకెల నంబర్‌తో కూడిన అపార్ గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయించింది. ఇందుకుగాను రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీని అమలుకు ఇటవల చర్యలు చేపట్టింది. అపార్ కార్డు కోసం విద్యా సంస్థల నిర్వాహకులు ఆధార్ కార్డు ప్రకారం విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే, ఆధార్‌కార్డుల్లో తప్పులను సరి చేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కాని అక్కడ తీవ్రజాప్యం కావడం వల్ల అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే యూడైస్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆదర్శ, గురుకుల, కేజీబీవీలు, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం లక్ష మందికి పైగా విద్యార్థులున్నారు. ఏడాది నుంచి విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నా ఎంతకీ లక్ష్యం చేరడంలేదు. ఐడీలు కేటాయిస్తున్నప్పటికీ ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి.
ఆధార్ కేంద్రాలకు పరుగులు
పాఠశాలల్లో చేర్పించే సమయంలో విద్యార్థుల వివరాలు, ఆధార్‌కార్డులోని వివరాలు ఒకే విధంగా ఉంటేనే అపార్ నంబరు వస్తుంది. లేని పక్షంలో వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు కావడం లేదు. పాఠశాలలోని వివరాలు మార్చేందుకు వీలుండదు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్థులకు జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని సంబంధిత ఉపాధ్యాయులు చెబుతుండంతో ఆధార్ వివరాలను మార్చేందుకు ఆధార్‌కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ మార్చాలంటే ఆధారాలతో కూడిన ధ్రువ పత్రాలు కావాలంటున్నారు. వాటిని సంపాదించాలంటే తలకుమించిన భారమే. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో తేడా ఉండటంతో అపార్‌లో నమోదులో సమస్యలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. ఒక్కసారి విద్యార్థుల వివరాలు ఆపార్‌లో నమోదైతే ఇక మార్పులు చేసుకోవడానికి ఎలాంటి వీలుండదు.
వేగవంతం చేస్తాం
ఆధార్‌కార్డుల్లో విద్యార్థుల వివరాలు సక్రమంగా లేకపోవడం, వాటిని సరిచేసుకునేందుకు అధిక సమయం పడుతుండడంతో అపార్ కార్డు నమోదు ప్రక్రియ ఆలస్యంగా సాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 31.54 శాతం నమోదు చేశాం. అపార్‌కార్డు గుర్తింపు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– గోవిందరాజులు, డీఈఓ
ఎల్‌కేజీ నుంచి విద్యార్థులకుఅపార్ ఐడీలు
జిల్లాలో ఇప్పటికీ 31.54 శాతమే పూర్తి
మొత్తం విద్యార్థులు 1,03,363 మంది
ఆధార్ ఆధారంగా వివరాల నమోదు
పాఠశాలలో, ఆధార్ వివరాల్లో పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాతో ఇబ్బందులు
మార్పు చేర్పులకు సమయం పడుతుండడంతో తీవ్ర జాప్యం
అపార్‌కు ఆటంకాలు
Comments
Please login to add a commentAdd a comment