ఎత్తిపోతల సర్వే పనులను అడ్డుకున్న రైతులు
మక్తల్: మండలంలోని కాట్రేవ్‌పల్లి, యర్నాగ్‌పల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు చేపట్టిన మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన కాల్వ నిర్మాణంతో తమ జీవనాధారమైన భూములు పోతాయని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసే వరకు సర్వే చేయొద్దని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ చంద్రశేఖర్, తహసీల్దార్ సతీష్‌కుమార్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే భీమా ప్రాజెక్టులో ఇప్పటికే భూము లు కోల్పోయామని.. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఉన్న భూములను తీసుకుంటే రోడ్డున పడతామని రైతులు వాపోయారు. భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, లేనిపక్షంలో ఎకరాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో అధికారులు సర్వే చేయకుండా వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment