సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు ఈ నెల 21న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వస్తున్నారని.. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రం సమీపంలోని మెడికల్ కళాశాలలో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 21న మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌లో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో ఏర్పాటుచేసే హెలిప్యాడ్ వద్దకు చేరుకుని జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించడంతో పాటు జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం అప్పక్‌పల్లి వద్ద ఉన్న మెడికల్ కళాశాలలో వంద పడకల ఎంసీహెచ్ విభాగంతో పాటు నర్సింగ్ కళాశాల, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. కళాశాల వద్ద ఏర్పాటుచేసే పబ్లిక్ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారని చెప్పారు. అక్కడి నుంచి తిరిగి సాయంత్రం హైదరాబాద్ బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు దగ్గరుండి పూర్తిచేయాలని సూచించారు. సింగారం నుంచి అప్పక్‌పల్లి వరకు రోడ్డుతో పాటు ఇరువైపులా స్థలాన్ని శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమాల్లో సీఎంతో పాటు పాల్గొనే వీవీఐపీలకు అన్ని వసతులను సమకూర్చాలని.. మధ్యాహ్న భోజనం మెడికల్ కళాశాలలోనే ఏర్పాటు చేయాలన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. పబ్లిక్ మీటింగ్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖపరంగా ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతకుముందు సింగారం చౌరస్తాలో సీఎం ప్రారంభించే పెట్రోల్ బంక్, జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ స్థలం, హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.రాంకిషన్, టీజీఎంఐడీసీ ఈఈ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఈ జైపాల్‌రెడ్డి, ఆర్టీఓ మేఘాగాంధీ, డీఎస్పీ లింగయ్య తదితరులు ఉన్నారు.
బాధిత మహిళలకు ‘భరోసా’
జిల్లా పోలీసు శాఖ భరోసా కేంద్రాల ద్వారా బాధిత మహిళలు, బాలికలకు అండగా నిలవడం అభినందనీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ కాలనీలో భరోసా కేంద్రం వార్షికోత్సవానికి కలెక్టర్‌తో పాటు ఎస్పీ యోగేష్ గౌతమ్ హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రం పనితీరును నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. ఏడాది కాలంలో 71 కేసులు నమోదయ్యాయని.. అందులో పోక్సో గ్రేవ్ 51, నాన్ గ్రేవ్ 9, అత్యాచార కేసులు 11 ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బాధిత మహిళలు, బాలికలకు భరోసా కేంద్రం నిర్వాహకులు అండగా ఉంటూ.. వారికి నిరంతరం రక్షణ కల్పించాలన్నారు. బాధితులకు న్యాయపరమైన సూచనలు, కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. అదే విధంగా బాధితులకు నైపుణ్యాలను నేర్పించి.. సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహద పడాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు. బాధితులకు సురక్షిత వాతావరణంలో చేయూత అందించేందుకు భరోసా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. హింస, లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలు మరల అటువంటి వాటి బారిన పడకుండా చూడటమే భరోసా సెంటర్ లక్ష్యమన్నారు. బాధితులకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న భరోసా కేంద్రం సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎన్.లింగయ్య, సీఐలు శివశంకర్, రాంలాల్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, భరోసా కేంద్రం ఇన్‌చార్జి ఎస్‌ఐ సునీత, కోఆర్డినేటర్ ప్రమీల, దేవి, చైల్డ్‌లైన్ నర్సింహులు, సఖి సెంటర్ రమాదేవి, కవిత, సీడబ్ల్యూసీ నుంచి కమల, నరేష్ పాల్గొన్నారు.
అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment