
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 21న నారాయణపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండడంతో సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీయోగేష్ గౌతమ్‌తో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి వద్ద గల మెడికల్ కళాశాల, సింగారం చౌరస్తాలో నూతన పెట్రోల్ బంక్‌ను, హెలిప్యాడ్ స్థలాన్ని, అప్పక్‌పల్లి వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. ఆయా స్థలాల్లో పనులు చేయిస్తున్న అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సభా స్థలి వద్ద 12 స్టాళ్లను ఏర్పాటు చేసే విషయమై వారు చర్చించారు. వేదికకు ఎటువైపు స్టాళ్లను ఏర్పాటు చేయాలనేది వేదిక స్తలాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామన్నారు. అనంతరం కలెక్టర్ మెడికల్ కళాశాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌తో అక్కడి ఏర్పాట్లపై చర్చించారు.
● ఎస్పీ యోగేష్‌గౌతమ్ సింగారం శివారులో ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి చుట్టూ బారికేట్స్ ఏర్పాటు చేయాలని, అప్పక్ పల్లి గ్రామ శివారులో పబ్లిక్ మీటింగ్ సంబంధించిన స్థలాలను పరిశీలించి పబ్లిక్ మీటింగ్ వద్ద భద్రతా ఏర్పాట్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్ వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, సింగారం శివారులో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వారితోపాటు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీఓ రామచందర్ నాయక్, గ్రంథాలయ సంస్థల వార్ల విజయకుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్‌రెడ్డి,ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ఉన్నారు.
మెడికల్ కళాశాలను పరిశీలించిన ఆర్‌వీ కర్ణన్
నారాయణపేట మండలంలోని అప్పక్‌పల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను బుధవారం కమిషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఆర్‌వీ కర్ణన్ పరిశీలించారు. ఈ నెల 21న సీఎం నారాయణపేట పర్యటన సందర్భంగా బుధవారం నారాయణపేటకు వచ్చి అప్పక్‌పల్లి వద్ద మెడికల్ కళాశాలను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కళాశాలలో జరిగే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలపై కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో చర్చించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని, పాత బస్టాండ్‌లోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిని సందర్శించి ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment