గడ్డు పరిస్థితులు
సొరంగంలో
అచ్చంపేట/అచ్చంపేట రూరల్/బల్మూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలకు నీటి ఊట అడ్డంకిగా మారింది. సొరంగంలో 14 రోజులుగా 12 విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయక చర్యలు, వనరులు సమకూరుస్తున్నారు. గురువారం కేరళలోని త్రిసూల్ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్ శుక్రవారం సొరంగంలోని ప్రమాద స్థలంలో సహాయక బృందాల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు టన్నెల్ లోపల పరిసరాలు పరిశీలించారు. అన్వి రోబోటిక్, హైదరాబాద్ బృందం ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకొని అవసరమైన సహకారం అందిస్తున్నారు. సొరంగంలో సహాయక బృందాలకు రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
సఫారీ వాహనంలో సిస్మాలజీ బృందం..
భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం నల్లమలలో సర్వే చేస్తున్నారు. రెండు ప్రత్యేక సఫారీ వాహనాలను అటవీశాఖ అధికారులు కేటాయించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అధికారులు సిస్మాలజీ ప్రతినిధులకు లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ లొకేషన్‌ను పంపిస్తుండగా సర్వే చేపడుతున్నారు. సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది.
సక్రమంగా పనిచేయని కన్వేయర్ బెల్ట్..
సొరంగంలో సింగరేణి కార్మికుల పనికి ప్రాధాన్యం ఉండటంతో అధికంగా తరలివస్తున్నారు. కాగా టీబీఎం వద్ద 7 కంటైనర్లు ఉండగా.. ఒక కంటైనర్ మాత్రం బయట పడిందని, మిగిలినవన్నీ మట్టితో కూరుకుపోయినట్లు సమాచారం. బయటపడ్డ కంటైనర్‌లో ఆక్సిజన్ సౌకర్యం ఉందని.. అందులో చిక్కుకున్న కార్మికులు ఉండి ఉంటే క్షేమంగా బయటపడేవారని సహాయక బృందాలు చెబుతున్నాయి. టీబీఎం విడిభాగాలను తొలగించడానికే అధిక సమయం పడుతుందని.. సరైన విద్యుత్ సౌకర్యం లేక కన్వేయర్ బెల్ట్ సక్రమంగా పని చేయకపోవడంతో మట్టి తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో కార్మికులు సుమారు ఆరు నుంచి 10 గంటలు పని చేస్తుండగా.. మొబైల్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.
కార్మికుల జాడ
కనుగొనేందుకు
రంగంలోకి కడావర్
డాగ్స్, రోబోటిక్ బృందం
14 రోజులైనా లభించని
ఆచూకీ
కొనసాగుతున్న
సహాయక చర్యలు
సహాయక చర్యలు ఇలా..
చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందం శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి వెళ్లింది.
15 ఫీట్ల లోపలున్న వారిని గుర్తించగలగటం ఈ శునకాల ప్రత్యేకత.
సొరంగంలోని బురద, మట్టి, ఇతర శిథిలాలను తొలగించేందుకు 110 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర బృందాలు లోకో ట్రైన్‌లో వెళ్లారు.
నలుగురు సభ్యుల అన్వి రోబోటిక్ నిపుణుల బృందం, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఉదయం 11.25కు మరోమారు సొరంగంలోకి వెళ్లారు.
నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గడ్డు పరిస్థితులు
Comments
Please login to add a commentAdd a comment