హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
నారాయణపేట రూరల్: హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని ప్రాంత విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నరసింహమూర్తి అన్నారు. స్థానిక సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం నారాయణపేట జిల్లా, పట్టణ విశ్వహిందూ పరిషత్ పూర్తిస్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసింహమూర్తి మాట్లాడుతూ.. నిద్రావస్థలో ఉన్న హిందూ సమాజం మేల్కొనాలని, రాజకీయ లబ్ధి కోసం కులాల పేరుతో విభజిస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. పల్లె నుంచి పట్టణం వరకు జరుగుతున్న మతమార్పిడులను అరికట్టాలన్నారు. దేవాలయాల పరిరక్షణకు కృషి చేద్దామని, గోసంరక్షణ దేయంగా ముందుకు పోదామన్నారు. ఇతర మతస్తుల యాత్రకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వాలు హిందువుల పండుగల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం సరికాదని ముక్తకంఠంతో ఖండించాలన్నారు. హిందువుల పూర్తిస్థాయి చైతన్యంతోనే మార్పు జరుగుతుందన్నారు. హిందువులపై దాడులకు పాల్పడే సంఘవిద్రోహులను పారద్రోలేలా, హిందూ జాగృతికి, హిందూ ధార్మిక కార్యక్రమాల అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
నూతన కమిటీల ఎన్నిక
విశ్వహిందూ పరిషత్ నారాయణపేట నూతన జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్న శివకుమార్, విభాగ కార్యదర్శిగా నరేందర్, విభాగ్ సహ కార్యదర్శిగా లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా మురళీబట్టడ్, ప్రధాన కార్యదర్శి కడుదాస్ ప్రవీణ్, బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షుడిగా వడ్ల శ్రావణ్, సహా ప్రయోజక్ గా భీమేష్ తోపాటు మరి కొంతమంది సభ్యులతో జిల్లా పట్టణ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రాంత ఉపాధ్యక్షులు జగదీశ్వర్లు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పగుడాకుల బాలస్వామి, దుర్గవాణి మాతృమండలి సభ్యులు పవిత్ర, లలిత, భాస్కర్, వందన, వైష్ణవి లతోపాటు నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల, గ్రామాల విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment