ఓ శతాబ్దం వెనక్కి వెళితే మనిషి రుగ్మతలను తెలుసుకోవాలన్నా.. విరిగిన ఎముకలను, పగుళ్లను గుర్తించాలన్నా.. రోగి వివిధ శరీర అవయవాలలో కేన్సర్ కణుతులను గమనించాలన్నా.. మెదడులోని నాళాల్లో రక్తం గడ్డ కడితే తెలుసుకోవాలన్నా.. చిన్న, పెద్ద పేగులకు రంధ్రం పడ్డా.. చివరికి గుండెకి చిల్లు ఉన్నా.. గుండె పనితీరును అధ్యయనం చేయాలన్నా.. రొమ్ము కేన్సర్‌ను గుర్తించాలన్నా.. ఊపిరితిత్తులలో నీరు చేరినా.. ఆయా శరీర భాగాల్లో కోతలు పెట్టి శస్త్రచికిత్సలు చేస్తేగాని తెలుసుకోలేకపోయేవారు. కానీ.. నేడు శరీరానికి చిన్నగాటు కూడా పెట్టకుండా, ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే వివిధ శరీర అవయవాల నిర్మాణం, పనితీరు, అవలక్షణాలు, రుగ్మతలు గుర్తించడంతో పాటు ముందుగానే కేన్సర్ వంటి రోగాలను పసిగట్టే వీలు ఏర్పడింది. ఇది కేవలం ఎక్స్ కిరణాల ఆవిష్కరణతోనే సాధ్యమైంది. ఎక్స్ కిరణాల ఆవిష్కరణ వైద్య చరిత్రలో ఓ గొప్ప మైలురాయి. ఎక్స్ కిరణాలను ఉపయోగించి ఎన్నో అధునాతన రోగ నిర్ధరణ, చికిత్సా యంత్రాలను కనుగొంటున్నారు. ఎక్స్ కిరణాలతో వైద్య రంగంలోనే పలు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
ఎన్నో రుగ్మతలు తెలుసుకునేలా..
ఎక్స్‌రేను ఉపయోగిస్తూ రేడియాలజీ విభాగంలో రోగ నిర్ధారణకు మాత్రమే కాకుండా కేన్సర్ లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఉపకరణాలు, యంత్రాలు కనుగొన్నారు. ఎక్స్‌రే ఆవిష్కరణ వైద్య రంగంలో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. మొదట్లో ఎముకల పగుళ్లను చూడడానికి మాత్రమే వినియోగించారు. ఆ తర్వాత యంత్ర పరికరాలతో వివిధ అవయవాల నిర్మాణం, పనితీరు, రు గ్మతలు తెలుసుకోవడమే కాకుండా చికిత్సలు చేయడానికి ఆవిష్కరణలు తోడ్పడుతున్నాయి. మెదడు, నాడీ వ్యవస్థ, రక్త నాళాలు, ఎక్స్ కిరణాలను ఉపయోగిస్తూ పనిచేసే ఎన్నో ఆధునిక పరికరాలు ఫ్లోరోస్కోపీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, పెట్ స్కాన్, స్పెక్ట్ స్కాన్, గామా కెమెరా, సి.ఆర్మ్ తదితర రోగాల నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఎక్స్ రే కిరణాలు కనుగొన్నాక వైద్య రంగంలో ఒక రోగ నిర్ధారణ విభాగం రేడియో డయాగ్నోసిస్ విభాగం నెలకొల్పారు. అది శాఖోపశాఖలుగా విస్తరించి ఈనా డు రేడియాలజీ. మేజియాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ, నూక్లియర్ మెడిసిన్ తదితర విభాగాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఎక్స్‌రే ఎలా..? 1895 నవంబర్ 8న జర్మనీ
భౌతిక శాస్త్రవేత్త సర్ విలియం కొనరాడ్ రాంట్‌జెన్ ఓసారి అనుకోకుండా ఎక్స్ రే కిరణాలను కనుగొన్నారు. ఆయన ఉత్సర్గ నాళ ప్రయోగాలతో కేథోడ్ కిరణాల ధర్మాల పరిశీలించే క్రమంలో పక్కనే ఉన్న ప్లాటినో సయనైడ్ ఫలకంపై తన చేతి ఎముకలు దర్శనమిచ్చాయి. ఆశ్చర్యానికి గురైన ఆయన మళ్లీ మళ్లీ పరీక్షించి ఏవో కిరణాలు శరీరం గుండా ప్రసరిస్తూ ఎముకల నీడలను ఏర్పాటు చేస్తున్నాయి. సాధారణంగా గణితంలో తెలియని దానిని ఎక్స్ ( గీ) అని అనుకుంటాం. అలాగే రాంట్‌జెన్ ఆ ధర్మాలు తెలియని కిరణాలకు ఎక్స్ కిరణాలు భావించారు. చివరికి అదే పేరు స్థిరపడింది. పరిశోధనాలయంలో ఆయన కనుగొన్న ఎక్స్ కిరణాలు మానవాళికి ఇంతగా ఉపయోగపడతాయని ఆనాడు ఆయన ఊహించలేదు. ఈ ఆవిష్కరణకు భౌతికశాస్త్రంలో రాంట్‌జెన్ 1901లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఎక్స్ కిరణాలు కనుగొన్న నవంబర్ 8వ తేదీన ప్రపంచ రేడియోగ్రఫీ డేగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇదే రోజున అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవంగా కూడా జరుపుకొంటారు.
కేవలం వైద్య రంగంలోనే కాకుండా..
ఎక్స్ కిరణాలను కేవలం వైద్య రంగంలోనే కాదు పరిశ్రమలలో వివిధ యంత్ర పరికరాల పగుళ్లు, లీకేజీలను కనుగొనడానికి, విమానయాన రంగంలో వివిధ వస్తువుల, వ్యక్తుల స్కానింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ఈ కిరణాల ఉపయోగం ఎంత ఉందో ఎలాంటి అశ్రద్ద, అజాగ్రత వహించినా సుశిక్షితులైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేకున్నా మేలు కన్నా కీడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు ఎంత ప్రమాదకరం అంటే కేవలం ఎక్స్ కిరణాలు ఎదుర్కొన్న వ్యక్తులలోనే కాకుండా వారి భవిష్యత్ తరాల లో కూడా వాటి దుష్పరిణామాలు సంభవించవచ్చు.
ఉపాధి అవకాశాలు మెండు..
శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి, కంప్యూటర్ వినియోగం పెరగడంతో ఎన్నో కొత్త ప్రక్రియలు, రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. రక్షణ చర్యలు, అతి తక్కువ రేడియేషన్ మోతాదులో వివిధ పరీక్షలు నిర్వహించేలా సాంకేతికత అభివృద్ధి చెందింది. రేడియాలజీ ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ రంగంలో స్థిర పడాలనుకునే వారికి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. – శిరందాస్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్
Comments
Please login to add a commentAdd a comment