
న్యూఢిల్లీ : బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు ఆమోదం చేసుకున్నారని ఆరోపించాయి. ఈ కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
ఈ మేరకు రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు బహిష్కరించనున్నాయి. ఈ సందర్భంగా విపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోతుందని.. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఉభయ సభల్లో సాగు చట్టాలను బలవంతంగా ఆమోదం చేయించినట్లు ఆరోపించారు అందుకే రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గణతంత్రం రోజు హింసాత్మక ఘటనలు ఖండనీయమని ప్రకటించారు. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని 16 పార్టీలు పేర్కొన్నాయి. దీనికోసం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment