న్యాయవ్యవస్థ పెత్తనం | Judicial authority | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థ పెత్తనం

Published Thu, May 12 2016 2:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

న్యాయవ్యవస్థ పెత్తనం - Sakshi

న్యాయవ్యవస్థ పెత్తనం

శాసన వ్యవస్థను ఆక్రమిస్తోంది: జైట్లీ
♦ పన్ను అధికారాన్నీ న్యాయవ్యవస్థ చేతుల్లో పెట్టడం దుస్సాహసం
♦ జీఎస్‌టీపై కాంగ్రెస్ తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలి
 
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను(జీఎస్‌టీ)పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది. ప్రత్యేకించి.. జడ్జి సారథ్యంలో వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయాలన్న అంశంపై పునరాలోచించాలని కోరింది. న్యాయవ్యవస్థ ఒక్కో అడుగు చొప్పున, ఒక్కో ఇటుక చొప్పున శాసనవ్యవస్థను ఆక్రమిస్తోందని, అటువంటి న్యాయవ్యవస్థ చేతుల్లో పన్నువిధించే అధికారాలను పెట్టటం దుస్సాహసం అవుతుందని పేర్కొంది. ఆర్థిక బిల్లుపై రాజ్యసభలో చర్చకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం సమాధానం ఇస్తూ.. జీఎస్‌టీపై తాము చేసిన మూడు కీలక సిఫారసులకు ప్రభుత్వం అంగీకరిస్తే ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ పేర్కొన్న నేపథ్యంలో ఆ పార్టీని ఒప్పించేందుకు ప్రయత్నించారు.  ‘శాసనవ్యవస్థను, కార్యనిర్వాహణ అధికారాన్ని న్యాయవ్యవస్థ ఏ విధంగా ఆక్రమిస్తోందో చూస్తే.. ఇక మనకు మిగిలిన చివరి అధికారం.. బహుశా ఆర్థిక అధికారం, బడ్జెట్ తయారు చేయటం మాత్రమే. రాష్ట్రాలకు ఉన్న ఏకైక అధికారం పన్ను విధించటమే.

పన్ను అధికారాన్ని న్యాయవ్యవస్థకు అప్పగించాలని ఏ రపార్టీ అన్నా అది చాలా పొరాపాటు ఆలోచన’ అని అన్నారు. జీఎస్‌టీ బిల్లును తెచ్చింది వాస్తవానికి కాంగ్రెసేని అంగీకరిస్తూ.. దీనిని రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఆమోదించడానికి కాంగ్రెస్ నేతలతో తాను చర్చిస్తానని పేర్కొన్నారు. జైట్లీ ప్రసంగం తర్వాత రాజ్యసభ ఆర్థిక బిల్లు, వినియోగ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో పార్లమెంటులో బడ్జెట్ ప్రక్రియ ముగిసినట్లయింది.  సుప్రీం కోర్టు బుధవారమే  జాతీయ విపత్తు సహాయ నిధి, రాష్ట్ర విపత్తు సహాయ నిధిలతో పాటు విపత్తు నివారణ నిధిని ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను జైట్లీ ప్రస్తావించారు. ‘వినియోగ బిల్లు ఆమోదం పొందింది. సుప్రీం నిర్దేశాలను అమలు చేయటానికి అదనపు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కో అడుగుగుఆ న్యాయవ్యవస్థ..నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుండటాన్ని మీరు చూడలేరా? వినియోగ బిల్లుకు వెలుపల.. ఈ నిధి, ఆ లెవీ ఏర్పాటు చేయాలని  చెప్తున్నారు.

కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య పన్ను విధించటంలో వివాదమొస్తే దానిని జడ్జి నిర్ణయించాలని ఒక పక్షం అడిగినట్లయితే.. పార్లమెంటు వెలుపల బడ్జెట్ తయారవుతుంద’న్నారు. పన్ను విధించటం అనేది రాజకీయ అంశమంటూ దానిని రాజకీయంగానే పరిష్కరించుకోవాలని, ఆ అధికారాన్ని కోర్టులకు అప్పగించజాలమని అన్నారు.  జీఎస్‌టీ గరిష్ట పరిమితిని 18%గా రాజ్యాంగంలో పేర్కొనాలన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. అలా రాజ్యాంగాన్ని సవరించటం సాధ్యం కాదని, ప్రభుత్వం ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధిక పన్ను విధించాల్సి రావచ్చొన్నారు. జీఎస్‌టీపై కాంగ్రెస్ పార్టీ విధించిన మూడు నిబంధనలపై పునరాలోచించాలని.. లేదంటే జీఎస్‌టీ బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించే పార్లమెంటు ఓటింగ్ ప్రక్రియను జరగనివ్వాలన్నారు. జీఎస్‌టీ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినా  ప్రభుత్వానికి మెజారిటీ లేని రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.
 
 రెండు రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా
 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కొనసాగుతున్న లోక్‌సభ సమావేశాల షెడ్యూలు గడువు మరో రెండు రోజులు మిగిలివుండగానే బుధవారం అర్థంతరంగా ముగించారు. అవాంతరాల కారణాల వల్ల వాయిదాలు లేకుండా మూడు వారాల పాటు కొనసాగింది. 16వ లోక్‌సభ ఎనిమిదో విడత సమావేశాలు.. ఏప్రిల్ 25వ తేదీన మొదలవగా 13 సార్లు సామావేశమై 92 గంటల 21 నిమిషాల పాటు పనిచేసింది.తాజాగా ముగిసిన సమావేశాలను.. బడ్జెట్ సమావేశాల్లో రెండో విడత భేటీగా తొలుత నిర్ణయించినప్పటికీ, మార్చి 10న తొలి విడత సమావేశాలు ముగిసిన తర్వాత ప్రొరోగ్ (అధికారికంగా సమావేశాలను ముగించటం) చేయటంతో ఈ సమావేశాలను వేరేగా పరిగణించారు. ఈ నెల 13వ తేదీ వరకూ సమావేశాల గడువు ఉన్నప్పటికీ బుధవారం నాడే ముగించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. మరోపక్క.. గురువారం సభాకార్యక్రమాల అనంతరం రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడనుందని అధికార వర్గాలు చెప్పాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement