న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 28.35 శాతం జనాభా కరోనా బారిన పడ్డారని.. వారందరిలో యాంటీబాడీస్(ప్రతిరోధకాలు) అభివృద్ధి చెందాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన సెరోలాజికల్ సర్వే రెండవ దఫా వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. దీని ప్రకారం ఢిల్లీలో 28.35 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు తెలిపారు. ఆగస్టు 1-7 వరకు జరిగిన ఈ సర్వేలో 15 వేల మంది నమూనాలను పరీక్షించామన్నారు. దీని ప్రకారం ఇప్పటివరకూ ఢిల్లీలో 58 లక్షల మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయన్నారు. ఢిల్లీలో వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ సెరోలాజికల్ సర్వే నిర్వహిస్తోంది. (ఓ కుదుపు కుదిపింది... కరోనా!)
జూలైలో మొదటి దఫా, ఆగస్టులో రెండో దఫా సర్వే నిర్వహించగా.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడు, నాలుగు దఫాల సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సత్యేంద్ర జైన్ తెలిపారు. జూలై 21న జరిగిన మొదటి సెరోలాజికల్ సర్వే ఫలితాల్లో దేశ రాజధానిలో 23.48శాతం జనాభా కరోనావైరస్ ద్వారా ప్రభావితమైందని తేలింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో కనిపించే యాంటీబాడీల స్థాయిని ఈ సెరోలాజికల్ సర్వే ద్వారా అంచనా వేస్తున్నారు. ఈ సర్వేలో ప్రజలకు వారి అనుమతితో రక్త పరీక్షలు నిర్వహించి శరీరంలోని యాంటీబాడీల స్థాయిని గుర్తిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment