సాక్షి, వెబ్‌డెస్క్: డేటింగ్ అనగానే మనం ఏదోదే ఊహించుకుంటాం.. పైగా పాశ్చత్య సంస్కృతి కావడంతో చాలా మంది దాన్ని తప్పుగా చూస్తారు. అయితే అన్ని డేట్‌లు ఒకేలా ఉండవు. ఇదే విషయాన్ని నిరూపిస్తున్నారు తమిళ నటుడు, ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఫోటోగ్రాఫర్ సుందర్ రాము. గత కొన్నేళ్లుగా ఆయన 335 మంది మహిళలతో డేటింగ్ చేశారు. ఆయన లక్ష్యం 365 మందితో డేటింగ్ చేయడం. దానికి ఇంక 30 మంది దూరంలో ఉన్నారు. అసలు ఇంత మందితో డేటింగ్ చేయడం ఏంటి.. ఈ టార్గెట్ ఏంటి వంటి తదితర వివరాలు తెలియాలంటే.. సుందర్ రాము గురించి పూర్తిగా తెలియాలి. ఆయన వివరాలు..
తమిళనాడు, చెన్నైకి చెందిన సుందర్ రాము సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ఆయన తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. పైగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన సుందర్ రాముని 2012లో జరిగిన నిర్భయ ఘటన బాగా కలచి వేసింది. చాలా రోజులు ఆ బాధలోనే ఉండి పోయారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఆయనకు తరచుగా వినిపించే ప్రశ్న.. ‘‘మీ దేశంలో ఎందుకు మహిళలను అంత దారుణంగా హింసిస్తారు’’ అని. ఇవన్ని ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ క్రమంలో ఆయనభారతదేశ మహిళలకు వారి హక్కుల గురించి తెలియజేయాలనుకున్నారు. అందుకు ఆయన ఎన్నుకున్న మార్గమే ఈ 365 డేటింగ్.
దీని గురించి సుందర్ రాము మాట్లాడుతూ.. ‘‘నేను స్త్రీలను బాగా చూసుకునే, గౌరవించే కుటుంబంలో పెరిగాను. లింగ వివక్ష లేని పాఠశాలలో చదువుకున్నాను. అబ్బాయిలు, అమ్మాయిలను వేరుగా చూడలేదు. కానీ, స్కూల్ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాక, సమాజంలో వేళ్లూనుకున్న లింగవివక్షను గమనించాను. అలాంటి సంస్కృతిని చూసి షాక్‌కు గురయ్యాను. 2012 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ సామూహిక అత్యాచార ఘటన నన్ను కుదిపివేసింది. చాలా రాత్రులు నిద్రపోలేకపోయాను'' అని తెలిపారు.
‘‘ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం నేను చేసిన ఆలోచన 365 డేట్స్ ప్రణాళిక. దీని గురించి 2014, డిసెంబర్ 31న ఫేస్‌బుక్‌లో ప్రకటించాను. ప్రారంభంలోనే నాకు తెలిసిన 10 మంది నుంచి కాల్ వచ్చింది. మే ఒకరి గురించి ఒకరం తెలుసుకున్న తర్వాత డేట్‌కి వెళ్లేవాళ్లం. 2015లో తమిళనాడులో వరదల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరుసటి ఏడాది తిరిగి ప్రారంభించాను. ఇప్పటి వరకు మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా పలువురు మహిళలతో డేట్‌కి వెళ్లాను. వీరిలో మా నానమ్మతో పాటు చెత్త ఎత్తే మహిళలు, పళ్లు అమ్ముకునే మహిళ, 90 ఏళ్ల ఐరిష్ సన్యాసిని, నటి, మోడల్స్, యోగా టీచర్, యాక్టివిస్టులు, రాజకీయాల్లో ఉన్నవారు ఇలా ఎంతోమంది ఉన్నారు. అయితే మా నానమ్మతో వెళ్లిన డేట్ మాత్రం చాలా ప్రత్యేకం’’ అన్నారు సుందర్ రాము.
‘‘ఇక నేను విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాను. నేను వెళ్లే డేట్స్ అన్ని శృంగారభరితమైనవి కావు. నా లక్ష్యం కేవలం ప్రేమ మాత్రమే. నేను ప్రతిరోజు ప్రేమను అన్వేషిస్తాను. డేట్ అనగానే ఏదో ఊహించుకోవడం కాదు. అలానే మహిళ అనగానే కేవలం ఆమె ఒంపుసొంపులు మాత్రమే కాదు. అంతకుమించి ఆలోచించగలగాలి. వారి స్థానంలోకి వెళ్లి.. ఆడవారు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుంటే.. అప్పుడు వారి గురించి మనకు ఎక్కువ అర్థం అవుతుంది. వారి మీద మరింత గౌరవం పెరుగుతుంది. నా 365 డేట్ ఉద్దేశం కూడా ఇదే’’ అన్నారు సుందర్ రాము.
Comments
Please login to add a commentAdd a comment