5 Things You Should Not Search In Google | గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే - Sakshi
Sakshi News home page

గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే!

Published Wed, Mar 3 2021 1:58 PM | Last Updated on Wed, Mar 3 2021 8:09 PM

5 Things You Should Never Search on Google - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చేస్తుంది. దీనికి తోడు ఏం కావాలన్నా వెతికి పెట్టే గూగుల్‌ తల్లి.. ఇంకేముంది..? యువత ఇష్టారీతిన ఏ అంశం పడితే ఆ అంశాన్ని గూగుల్‌లో శోధన చేసేస్తున్నారు. అయితే, మొబైల్‌ ఫోన్‌ ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి గూగుల్‌ శోధన చేయొద్దని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఫోన్‌ ద్వారా వినియోగించే వారు నేరుగా ఆ మాధ్యమం సైట్‌ నుంచే లాగిన్‌ అవ్వాలని సూచిస్తున్నారు. పోర్న్‌ సైట్లు అసలు ఓపెన్‌ చేయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. 

1. ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వాలు అందించే పథకాలను గూగుల్‌లో‌ శోధన చేయొద్దు. పథకాలు అందుతాయన్న భావనతో అందించే వివరాలు తీసుకొని నకిలీ సైట్‌ నిర్వాహకులు సులభంగా మీ ఫోన్‌లోకి ప్రవేశిస్తారు. తద్వారా సమాచారం తస్కరించడంతోపాటు ఇతరత్రా ఇబ్బందులూ సృష్టించే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్న నేపథ్యంలో నిపుణులు ఈ హెచ్చరిక చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లోకి ఆ తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలే కానీ నేరుగా పథకం పేరుతో గూగుల్‌ శోధన చేయొద్దని వారు చెబుతున్నారు. 

2. కస్టమర్‌ కేర్‌ నంబర్లు
వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులపై ఏదైనా సమాచారం కావాలనుకుంటే కస్టమర్‌ కేర్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయడం పరిపాటిగా మారింది. రుణాల విషయంలోనూ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. కొంతమంది నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు సృష్టించి వాటి ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారు. దీంతో, మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌ సెర్చ్‌ చేసేటప్పుడు నేరుగా ఫలానా కస్టమర్‌కేర్‌ నంబరు అని కాకుండా సదరు సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కస్టమర్‌ కేర్‌ నంబరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే నకిలీ నంబరుకు ఫోన్‌ చేసి అడిగిన వివరాలన్నీ చెప్పడం వల్ల తీవ్ర నష్టం ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు.  

3. యాంటీ వైరస్, సాఫ్ట్‌వేర్లు
అధికారిక గూగుల్‌ ప్లేస్టోర్, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌ ద్వారానే యాప్‌లు, యాంటీవైరస్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నేరుగా యాంటీవైరస్‌లు శోధన చేసి డౌన్‌ లోడ్‌ చేసుకోవడం వల్ల ఫోన్‌లో వైరస్‌ రావడంతోపాటు సమాచారం కూడా పొగొట్టుకోవాల్సి వస్తుంది. యాంటీ వైరస్‌ యాప్‌ల్లో నకిలీ ఉత్పత్తులను గుర్తించలేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.  

4. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌
గూగుల్‌లో నకిలీ బ్యాంకుల వెబ్‌సైట్లు ఎక్కువగా వస్తున్నాయని, మొబైల్‌ ద్వారా బ్యాంకింగ్‌ వెబ్‌సైట్లు వెతికే క్రమంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల అధికారిక యూఆర్‌ఎల్‌ నుంచి లాగిన్‌ అవడం శ్రేయస్క రం అంటున్నారు. దీనివల్ల ఐడీ, పాస్‌వర్డ్‌లు తస్కరించడం అసాధ్యమని చెబుతున్నారు. ఒకవేళ బ్యాంకింగ్‌ సైట్లు చూడక తప్పనిసరి పరిస్థితి అయితే ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వాటిని చూడాలని సూచిస్తున్నారు.  

5. షాపింగ్‌ ఆఫర్లు, కూపన్‌కోడ్‌లు
ఇటీవల కాలంలో ఆఫర్లు ఎక్కువ కావడంతో సైబర్‌ మోసగాళ్లు ఆ దిశగా వినియోగదారులను వలలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు. షాపింగ్‌ ఎక్కడ చేస్తే ఆఫర్లు బాగా ఉంటాయి, కూపన్‌ కోడ్‌లు ఎలా పొందాలని వినియోగదారులు మొబైల్‌ ద్వారా శోధన చేయడంతో మోసగాళ్ల పని మరింత సులభం అవుతోందంటున్నారు. నకిలీ ఆఫర్లు, కూపన్లు ఆశ చూపి బ్యాంకుల సమాచారం లాగేసుకుంటున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

చదవండి:

సామాన్యుడిపై మరో పిడుగు

ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement