
జైపూర్: రెండో పెళ్లి చేయకపోతే చచ్చిపోతానంటూ కరెంటు స్థంభం ఎక్కాడో వ్యక్తి. పెళ్లికి అంగీకరించకపోతే కరెంటు వైర్లు పట్టుకుని శవమైతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఢోలాపూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఢోలాపూర్‌కు చెందిన 60 ఏళ్ల వయసున్న సోబ్రన్ సింగ్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీళ్లందరికీ పెళ్లిళ్లవగా అందులో కొందరికి పిల్లలు కూడా పుట్టారు. అయితే నాలుగేళ్ల క్రితం సోబ్రన్ భార్య కాలం చేసింది. దీంతో అప్పటి నుంచి అతడు రెండో పెళ్లి చేసుకుంటానంటూ కుటుంబం మీద ఒత్తిడి తెచ్చాడు. కానీ ఎవరూ దీనికి అంగీకరించలేదు.
ఈ క్రమంలో ఆదివారం నాడు మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అతడికి, కుటుంబ సభ్యులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన అతడు 11 కెవి హైటెన్షన్ వైర్లు ఉన్న కరెంటు స్థంభం ఎక్కి చచ్చిపోతానంటూ బెదిరించాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోగా కిందకు దిగమంటూ అభ్యర్థించారు. కానీ అందుకు అతడు ససేమీరా అన్నాడు. ఇక అతడు పోల్ ఎక్కాడని తెలియగానే కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని సబ్‌స్టేషన్‌కు తెలియజేయగా అక్కడి సిబ్బంది కరెంటు సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. చివరికి అతడిని కుటుంబ సభ్యులు బుజ్జగించి బతిమాలి బామాలి కిందకు దిగేలా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment