
అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో పండ్ల రసం దుకాణం నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సదరు బామ్మను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇటీవల అమృత్‌సర్ బామ్మ ఉదంతాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా నెటిజన్లు తిలకించారు.
అమృత్‌సర్‌లోని ఉప్పల్ న్యూరో ఆసుపత్రి సమీపంలో రాణి దా బాగ్ వద్ద ఆమె స్వయంగా జ్యూస్ స్టాల్ నడిపిస్తున్నారు. 80 ఏళ్ల బామ్మ బత్తాయి రసం తయారు చేసి, విక్రయిస్తున్న దృశ్యం జనం మనసులను కదలిస్తోంది. ఆమెపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆవేదన పంచుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని చాలామంది బామ్మ బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆరా తీస్తున్నారు. బామ్మ దుకాణంలో పండ్ల రసం తాగి, ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటూ అమృత్‌సర్ ప్రజలకు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. జీవనోపాధి కోసం జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న బామ్మకు హ్యాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటితరం యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. వృద్ధుల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఓ నెటిజన్ అభ్యర్థించాడు.
Comments
Please login to add a commentAdd a comment