![Actor Govinda accidentally shoots leg as revolver misfires](/styles/webp/s3/article_images/2024/10/2/govindha.jpg.webp?itok=E5tfL_91)
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(60) కాలికి బుల్లెట్ గాయమైంది. ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతుండగా ఉదయం 4.45 గంటల సమయంలో చేతిలో ఉన్న లైసెన్సుడ్ రివాల్వర్ అనుకోకుండా పేలిందని పోలీసులు తెలిపారు. ‘వైద్యులు గోవిందా కాలిలోని బుల్లెట్‌ను తొలగించారు. ఎడమ మోకాలి దిగువన 8–10 కుట్లు పడ్డాయి. ఆయన కోలుకుంటున్నారు’అని పోలీసులు తెలిపారు.
ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టామన్నారు. ‘అభిమానులు, తల్లిదండ్రులు, ఆ దేవుని ఆశీర్వాదంతో గాయం నుంచి కోలుకుంటున్నాను. నాకు తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారు’అంటూ గోవిందా ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.
మంగళవారం కోల్‌కతాలో జరిగే ఓ షోలో గోవిందా పాల్గొనాల్సి ఉందని ఆయన మేనేజర్ శశి సిన్హా తెలిపారు. రివాల్వర్‌ను కప్‌బోర్డులో ఉంచే సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌పై వేలు పడి, పేలి కాలికి తగిలిందని సిన్హా వివరించారు. రివాల్వర్‌ను చెక్ చేస్తుండగా చేతుల్లో జారి అనుకోకుండా పేలిందని గోవిందా సోదరుడు కృతి కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment