చూసేదేమిటి? చేసేదేమిటి?.. మన ఆదిత్యుడి కథా కమామిషు.. | ADITYA-L1 Mission: 7 payloads of ISRO Aditya L-1 mission will study the sun | Sakshi
Sakshi News home page

చూసేదేమిటి? చేసేదేమిటి?.. మన ఆదిత్యుడి కథా కమామిషు..

Published Sun, Sep 3 2023 5:28 AM | Last Updated on Sun, Sep 3 2023 7:03 AM

ADITYA-L1 Mission: 7 payloads of ISRO Aditya L-1 mission will study the sun - Sakshi

సౌర కుటుంబం మొత్తానికి తన వెలుగుల ద్వారా శక్తిని అందించే సూర్యుడిపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వదిలిన బాణం ఆదిత్య–ఎల్‌1 లక్ష్యం వైపు దూసుకెళుతోంది. సుమారు 4 నెలల ప్రయాణం, 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి ఈ అబ్జర్వేటరీ (వేధశాల) భూమి, సూర్యుడు ఆకర్షణ శక్తి రెండూ లేని లగ్రాంజ్‌ పాయింట్‌ వద్దకు చేరుకోనుంది.

ఆదిత్య–ఎల్‌1లో ఏ పరికరాలున్నాయి? వాటితో చేసే ప్రయోగాలేమిటి? పరిశీలనలేమిటి?ప్రయోజనాలేమిటి?స్థూలంగా.... ఆదిత్య–ఎల్‌1లో మొత్తం 7శాస్త్రీయ పరికరాలు ఉంటాయి. వీటిల్లో నాలుగు సూర్యుడిని పరిశీలించేందుకు ఉపయోగిస్తే.. మిగిలిన మూడు లగ్రాంజ్‌ పాయింట్‌ దగ్గరే వేర్వేరు ప్రయోగాలు చేస్తాయి. ఒక్కో పరికరం.. దాని ప్రాశస్త్యం, చేసే పని గురించి తెలుసుకుందాం...

► విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రఫ్‌ (వీఈఎల్‌సీ): సూర్యుడు ఓ మహా వాయుగోళం. హైడ్రోజన్‌ అణువులు ఒకదాంట్లో ఒకటి కలిసిపోతూ (కేంద్రక సంలీన ప్రక్రియ) అపారమైన శక్తిని విడుదల చేస్తూండే ప్రాంతం. కంటికి కనిపించే సూర్యుడి భాగాన్ని ఫొటోస్ఫియర్‌గా పిలుస్తారు. దీని దిగువన ఉన్న ఇంకో పొరను క్రోమోస్ఫియర్‌ అని.. దీని దిగువన ఉన్న మరో పొరను కరోనా అని పిలుస్తారు. వీఈఎల్‌సీ అనేది ఈ కరోనా పొర ఛాయాచిత్రాలను తీస్తుంది. అలాగే వేర్వేరు కాంతుల్లో (పరారుణ, అతినీలలోహిత, ఎక్స్‌–రే) కరోనాను పరిశీలిస్తుంది కూడా. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్, ఇస్రోలు కలిసి తయారు చేసిన ఈ పరికరం కరోనా నుంచి వెలువడే శక్తిమంతమైన కణాల ప్రవాహాం (కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌)పై  ఓ కన్నేస్తుంది. కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్లతో వెలువడే శక్తిమంతమైన ఫొటాన్లు భూ వాతావరణంపై ప్రభావం చూపగలవని అంచనా.

► సోలార్‌ అ్రల్టావయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌(ఎస్‌యూఐటీ): వీఈఎల్‌సీ కరోనా అధ్యయనానికి ఉపయోగిస్తూంటే ఈ ఎస్‌యూఐటీని ఫొటో స్పియర్, క్రోమోస్పియర్ల ఛాయాచిత్రాలు తీసేందుకు ఉపయోగిస్తారు. అది కూడా అతినీలలోహిత కాంతి మాధ్యమం ద్వారా. అలాగే ఈ ప్రాంతంలో సూర్యుడి ఇర్రేడియన్స్‌ (నిర్దిష్ట ప్రాంతంలో పడే రేడియోధారి్మక శక్తి మొతాదు)ను కూడా కొలుస్తారు. ఇస్రో సహకారంతో పుణేలోని ఇంటర్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ అస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ నిర్మించింది ఈ పరికరాన్ని.  

► సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ (సోలెక్స్‌): హై ఎనర్జీ ఎల్‌–1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌–రే స్పెక్ట్రోమీటర్‌ (హీలియోస్‌) సూర్యుడి నుంచి వెలువడే ఎక్స్‌–రే కిరణాల పరిశీలనకు ఈ రెండు పరికరాలను ఉపయోగిస్తారు. కాకపోతే సోలెక్స్‌ అనేది కరోనా నుంచి వెలువడే ఎక్స్‌–రే కిరణాల్లో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు, మార్పులను అధ్యయనం చేస్తే హీలియోస్‌ ఎక్కువ శక్తిగల వాటిపై దృష్టి పెడుతుంది. ఈ రెండు పరికరాలను బెంగళూరులోని యు.ఆర్‌.రావు శాటిలైట్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది.

► ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (ఎస్‌పెక్స్‌): పేరులో ఉన్నట్లే ఇది సౌరగాలుల్లోని కణాలపై ప్రయోగాలు చేస్తుంది. ఈ కణాల వేగం, సాంద్రత, ఉష్ణోగ్రతల వంటివి గుర్తిస్తుంది. తద్వారా ఈ గాలులు ఎక్కడ పుడుతున్నాయి? ఎలా వేగం పుంజుకుంటున్నాయన్నది తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది.  

► ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య (పాపా): సూర్యుడి కరోనా పొర వెలువరించే ప్లాస్మా ధర్మాలను, సౌర గాలుల్లో ఏమేం ఉంటాయి? ఉష్ణోగ్రత, సాంద్రతలను గుర్తిస్తుంది. తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లోని స్పేస్‌ ఫిజిక్స్‌ లాబొరేటరీ  తయారు చేసింది.  

► అడ్వాన్స్‌డ్‌ ట్రై ఆక్సియల్‌ హై రెజల్యూషన్‌ మాగ్నెటోమీటర్‌: ఆదిత్య ఎల్‌–1 సూర్యుడిని పరిశీలించే ప్రాంతంలో గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను లెక్కగట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్రాలకు సౌర గాలులు, కరోనా తాలూకూ ప్లాస్మాల మధ్య సంబంధాలను గమనిస్తుంది. బెంగళూరులోని లా»ొరేటరీ ఫర్‌ ఎలక్ట్రో ఆప్టిక్స్‌ సిస్టమ్‌ అభివృద్ధి చేసిందీ పరికరాన్ని.

మన ఆదిత్యుడి కథ కమామిషు...
► సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఖగోళ వస్తువు, నక్షత్రం అయిన సూర్యుడి వయసు సుమారు 460 కోట్ల సంవత్సరాలు
► భూమి వ్యాసార్ధం కంటే దాదాపు 864,938 రెట్లు ఎక్కువ వ్యాసార్ధం సూర్యుడిది. కొంచెం అటు ఇటుగా 13.9 లక్షల కిలోమీటర్లు!!
► అతి భారీ వాయుగోళమైన సూర్యుడిలో 75 శాతం హైడ్రోజన్‌ కాగా.. మిగిలిన 25 శాతం హీలియం. లేశమాత్రంగా కొన్ని ఇతర అణువులు కూడా ఉంటాయి.  
► కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా సూర్యుడిపై హైడ్రోజన్‌ కాస్తా హీలియంగా మారుతూంటుంది.
► సూర్యుడిపై ఉష్ణోగ్రత అన్నిచోట్ల ఒకేలా ఉండదు. కంటికి కనిపించే సూర్యుడి ఉపరితలం (ఫొటోస్పియర్‌) ఉష్ణోగ్రత సుమారు 5,500 డిగ్రీ సెల్సియస్‌. ఈ ఫొటోస్ఫియర్‌కు దిగువన క్రోమోస్పియర్‌ ఉంటే.. దాని దిగువన ఉండే కరోనా ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 నుంచి 30 లక్షల డిగ్రీల సెల్సియస్‌. కరోనా కంటే లోతైన ప్రాంతం లేదా సూర్యుడి మధ్యభాగంలో వేడి కోటీయాభై లక్షల డిగ్రీల సెల్సియస్‌ అని అంచనా.  
► సముద్రానికి ఆటుపోట్ల మాదిరిగా సూర్యుడిపై జరిగే కార్యకలాపాల్లో కూడా ఒక క్రమపద్ధతి ఉంటుంది. పదకొండేళ్లకు ఒకసారి ఆ కార్యకలాపాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2019 డిసెంబరులో సూర్యుడు 25వ సోలార్‌ సైకిల్‌లోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement