భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్ మొదలైంది.. | AIIMS Chief Says Covid Pandemic May Continue Second Wave In India | Sakshi
Sakshi News home page

సెకండ్‌ వేవ్‌ మొదలైంది.. ఇప్పుడప్పుడే అంతం కాదు!

Published Sat, Sep 5 2020 10:03 AM | Last Updated on Sat, Sep 5 2020 12:58 PM

AIIMS Chief Says Covid Pandemic May Continue Second Wave In India - Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ పెరిగిందని, కొన్నిచోట్ల సెకండ్‌ వేవ్‌ కూడా మొదలై పోయిందని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో తీసుకున్నంతగా ప్రజలు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఢిల్లీలో కొంతమంది మాస్కులు లేకుండానే బయట సంచరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా ఒక్కచోట చేరుతున్నారని, కరోనా వ్యాప్తికి ముందున్న విధంగానే భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందని.. ఇవన్నీ సెకండ్‌ వేవ్‌కు దారితీసే విధంగా ఉన్నాయన్నారు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడప్పుడే వైరస్‌ కనుమరుగయ్యే అవకాశం కనిపించడం లేదని, భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు.(చదవండి: ఢిల్లీ హైవే ధాబాల్లో కరోనా కలకలం)

అయితే దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెరిగిందని, కాబట్టే కేసుల సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. ఒకానొక సమయంలో శిఖర స్థాయిని చేరిన తర్వాత కరోనా బాధితుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే మన జానాభా చాలా ఎక్కువ అని, అది కూడా కేసుల సంఖ్యపై ప్రభావం చూపుతుందన్నారు. రోజుకు పది లక్షల కంటే ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ గులేరియా.. ఇండియా టుడేకి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

సురక్షితమా కాదా అన్నది ముఖ్యం
‘‘ఇప్పుడు చాలా దేశాల్లో కరోనా నిరోధక వ్యాక్సిన్‌ ప్రయోగాలు మొదలయ్యాయి. భారత్‌ నుంచే 3 వ్యాక్సిన్లు రాబోతున్నాయి. అయితే ఏ వ్యాక్సిన్‌ అయినా ఎంత వరకు సురక్షితం, సమర్థవంతమైనది అన్న దానిపైనే కరోనా కట్టడి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ గురించి ది లాన్సెట్‌లో ప్రచురించిన కథనం చూసినట్లయితే.. శాంపిల్‌ సైజ్‌ (76 మందిపై జరిపిన ట్రయల్స్‌ వివరాలను కథనంలో పేర్కొన్నారు) చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ మందిపై ప్రయోగాలు జరిపారు. చిన్నపాటి సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటాయని చెప్పారు. కాబట్టి మూడో దశ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంటేనే గానీ కోవిడ్‌ను అంతం చేయగల టీకా అందుబాటులోకి వచ్చే విషయం గురించి ఓ అవగాహనకు రాలేము. ఇందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అంతా సాఫీగా జరిగి, ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ వస్తే బాగుంటుంది. 

ఇక యూనివర్సల్‌ వ్యాక్సినేషన్‌కు మరికొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది’’అని గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేంత వరకు.. అన్ని చోట్లా భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని గులేరియా ప్రజలకు సూచించారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా భారత్‌లో శుక్రవారం కొత్తగా 83,341 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 39,36,747కు చేరుకుంది. శుక్రవారం 1,096 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 68,472కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రికవరీ రేటు  77.15 శాతానికి పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశంగా పరిణమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement