80-Year-Old Bibiji Juice Stall In Amritsar Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

బామ్మ జ్యూస్‌ స్టాల్‌: వావ్‌ అంటున్న నెటిజనులు, వైరల్‌ వీడియో

Published Wed, Jul 28 2021 3:19 PM | Last Updated on Wed, Jul 28 2021 4:43 PM

Amritsar bibiji juice stall going viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధాప్యంలో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలు మీద కాలు వేసుకుని జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదు గానీ, తమకు ఏజ్ జస్ట్‌ ఒక నంబరు మాత్రమే. అసలు వయసు ఒక సమస్యేకాదు అని చాలామంది సీనియర్‌ సిటిజన్స్‌ నిరూపిస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా మాకు మేమే సాటి అంటూ ఈమధ్య కాలంలో చాలామంది దర్శనమిస్తున్నారు. తమ టాలెంట్‌తో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారుతున్నారు.  తాజాగా పంజాబ్‌కు చెందిన జ్యూస్‌ స్టాల్‌ బామ్మ వార్తల్లో నిలిచారు.

అమృత్‌సర్‌లోని  80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం తీసి యిస్తూ కస్టమర్లను భలే ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా చాలా కష్టపడుతూ జ్యూస్‌ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు యుక్తవయసులో కూడా పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా బ్యాచ్‌కు ఈ బామ్మ పెద్ద సవాలే విసురుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేనా తన కష్టార్జితాన్ని నమ్ముకుని గౌరవంగా జీవించాలనుకునేవారికి ఆమె ఒక రోల్‌ మోడల్‌  అని  అభిప్రాయపడుతున్నారు.

ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక  ట్విటర్‌ యూజర్‌ వీడియోను ట్వీట్‌ చేశారు. అంతే అది క్షణాల్లో  వైరల్‌ అయింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్‌ చేయగా మరికొందరు భిన్నంగా స్పందించారు. పాశ్చాత్య దేశాలలో, సీనియర్లు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా  పెన్షన్లు పొందుతారు. కానీ మన దేశంలో మాత్రం వారికి నరకమే అంటూ ఒకరు ఆవేదన వ్యక‍్తం చేశారు.  అలాగే సులభంగా డబ్బు కావాలనుకునే యువత ఈమెను చూసి  సిగ్గుపడాలని మరొకరు ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement