న్యూఢిల్లీ: ‘‘నువ్వు నిజమైన, పరిపూర్ణ మహిళవు కాదు కదా’’.. మోడలింగ్ షూట్‌కు వెళ్లిన ఆర్చీ సింగ్‌ను ఉద్దేశించి ఓ ఏజెంట్ నోటి నుంచి వచ్చిన మాట. ఇలాంటి ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి ఆమెకు. ఎందుకంటే తొలుత ఆమె అతడుగా ఉండేవాడు. తనలోని నిజమైన ఆత్మను గుర్తించి స్త్రీగా మారాలని నిశ్చయించుకున్నాడు. పదిహేడేళ్ల వయస్సులో తన సెక్సువల్ ఐడెంటిని బయటపెట్టిన ఆర్చీ.. ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా అమ్మాయిలా మారిపోయాడు. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. మిస్ ట్రాన్స్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ఈ క్రమంలో అనేకసార్లు ఆమెకు వినిపించిన మాట.. ‘‘నువ్వు నిజంగా అమ్మాయివి కాదు’’..
ఇందుకు ఆర్చీ సమాధానం ఒక్కటే.. ‘‘ నేనూ మహిళనే.. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ ఒక స్త్రీకి ఉండే గుణాలన్నీ నాలో ఉన్నాయి. నేను అమ్మాయినే అని రుజువు చేసేందుకు ప్రభుత్వం నాకిచ్చిన ఐడీ నా వద్ద ఉంది. నేను సర్జరీ చేయించుకుని పూర్తిగా స్త్రీగా మారిపోయాను’’ అని. కానీ ఇలా ఎన్నిసార్లు చెప్పినా సరే సంకుచిత మనస్తత్వం గల కొంతమంది వ్యక్తులు ఆమెను కావాలనే తమ సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి వేధించేవారు. అయినా ఆర్చీ సింగ్ ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకుంది. కొలంబియాలో జరిగే అందాల పోటీలకు సన్నద్ధమవుతోంది.(చదవండి: షేపవుట్..? ఫొటోషూట్..)
కుటుంబం అండగా నిలబడింది
ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ఆర్చీ సింగ్ జన్మించింది. ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న సమయంలో తన మానసిక పరిస్థితి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. తొలుత వాళ్లు ఆందోళన చెందినప్పటికీ.. అర్థం చేసుకుని ఆర్చీకి అండగా నిలబడ్డారు. ‘‘నాలో దాగున్న నన్ను.. కేవలం నన్ను మాత్రమే నేను చూడాలనుకున్నాను. వేరే ఎవరిలాగానో నటించడం నా వల్ల కాలేదు. మోడలింగ్ చేయాలనేది నా కల. ఈ కెరీర్ ఆరంభించకముందు సోషల్ వర్క్‌లో భాగమయ్యాను. ట్రాన్స్‌జెండర్ల గురించి సమాజంలో ఉన్న అపోహలు, అనుమానాలు, చిన్నచూపు తొలగిపోయేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. మోడలింగ్ వల్ల ఇది మరింత విస్త్రృతమైంది. నాకొక చక్కని వేదిక దొరికనట్లయింది’’ అని ఆర్చీ సింగ్ తన గతం, వర్తమానం గురించి చెప్పుకొచ్చింది.
ఇక సమాజంలో తమ పట్ల ఉన్న వివక్ష గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతిభ, అందం లేని కారణంగా నాకెప్పుడూ అవకాశాలు రాకుండా పోలేదు. కేవలం నేను ట్రాన్స్ వుమన్ అయినందు వల్లే ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నా. అయితే వాటన్నింటినీ అధిగమించి నేడు అంతర్జాతీయ వేదికపై నడిచే అవకాశాన్ని దక్కించుకున్నాను. జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతి మనిషి తనలోని మానవత్వాన్ని, తోటి ప్రాణులను ఆదుకునే గుణాన్ని మాత్రమే తన గుర్తింపుగా చేసుకోవాలి. సెక్సువాలిటీ లేదా చేసే పని ఆధారంగా ఫలానా అనే గుర్తింపు కంటే ముందు మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి’’ అని తన ఆలోచనలు పంచుకుంది.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ట్రాన్స్‌జెండర్ల పట్ల చిన్నచూపు ఎక్కువగా ఉందన్న ఆర్చీ.. ప్రకృతిసిద్ధంగా జరిగే మార్పులకు తమను నిందించాల్సిన పనిలేదని, ఈ విషయం గురించి ఎడ్యుకేట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021 టైటిల్ విజేతగా నిలవడమే తన ముందున్న ప్రస్తుత లక్ష్యం అంటున్న 22 ఏళ్ల ఆర్చీ సింగ్.. తనలాంటి మరెంతో మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపడతానని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment