భారతీయులు బతుకు దెరువు కోసం దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు తెలియకుండానే ఆ దేశాల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా జర్మనీకి వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తమ చిన్నారికి దూరంగా గడపాల్సి వస్తోంది. చివరికి ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. అసలేం ఏం జరిగిందంటే...
ఇదేం అన్యాయం.. మా పాపను ఇప్పించండి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంట ఉపాధి కోసమని జర్మనీకి వెళ్లారు. అక్కడ ఆ దంపతులకి ఓ అడబిడ్డ(అరిహా షా)జన్మించింది. ఓ రోజు అనుకోకుండా ఆ పాప ఆడుకుంటుంటే ప్రమాదవశాత్తు ప్రైవేట్ పార్ట్ దెబ్బతింది. వెంటనే పాప చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అతను చెకప్ చేసి పాప బాగుందని చెప్పి వాళ్లని వెనక్కి పంపారు. కొన్ని రోజుల తదుపరి తనిఖీ కోసం వెళ్ళగా.. ఈ సారి కూడా క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారు కానీ జర్మనీలోని చైల్డ్ సర్వీసెస్ అధికారులని పిలిచి, వారి కస్టడీలో ఆ పాపని ఉంచారు. దీంతో షాకైన తల్లిదండ్రులు అధికారులను గట్టిగా నిలదీశారు. పాపపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పారు.
అన్ని రిపోర్ట్‌లు ఇచ్చినా.. మళ్లీ మొదటికి
అయితే ఆ దంపతులు వాళ్ల పాపను వెనక్కి తెచ్చకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 2021లో పాపపై లైంగిక వేధింపుల అనుమానాలాను ఆ ఆసుపత్రిలోని వైద్యులు తోసిపుచ్చిన రిపోర్ట్‌ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ విషయంలో మరింత స్పష్టత కోసం తల్లిదండ్రుల డీఎన్‌ఏ పరీక్ష, పోలీసు విచారణ, వైద్య నివేదికలు ఇలా వీటి తర్వాత, లైంగిక వేధింపుల కేసును ఫిబ్రవరి 2022లో మూసేశారు. ఈ ఆధారాలతో ఆ దంపతులు జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారులను కలిశారు. అయితే వారు ఆ పాపను ఇవ్వకపోగా తిరిగి దంపతులపై కేసు పెట్టారు. దానిపై పాప తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా... అక్కడ వాళ్లు పిల్లలను పెంచే సమర్థతను నిరూపించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఆ పరీక్షల్లో సైకాలజిస్టు పాప తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు. దీంతో వారికున్న దారులన్నీ మూసుకుపోయాయి.
ప్రధాని మాకు న్యాయం చేయాలి..
ఈ విషయంపై పాప తల్లి మాట్లాడుతూ.. జర్మనీలో ఉన్న తమ పాపను కలిసేందుకు ప్రతి నెలా ఒక గంట పాటు అనుమతిస్తున్నారని పేర్కొంది. చివరికి పాపను భారత్‌కు పంపేందుకు అక్కడి అధికారులు అంగీకరించట్లేదని అవేదన వ్యక్తం చేసింది. చేసేదేమి లేక అరిహా షా తల్లిదండ్రులు ఇటీవలే ముంబైలో దిగారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, జర్మనీ ప్రభుత్వం నుంచి తమ కుమార్తెను తిరిగి ఇప్పించాలని ఆ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. మూడేళ్ల బాలిక గత ఏడాదిన్నర కాలంగా జర్మనీ అధికారుల కస్టడీలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment