ఢిల్లీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో విచారణ కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)మరోసారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాల్సిందిగా కేజ్రీవాల్‌ను పిలిచారు. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.
దేశంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపధ్యంలో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేయనున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా కేజ్రీవాల్ తీరు చూస్తుంటే హేమంత్ సోరెన్‌ను కాపీ కొడుతున్నారేమోననే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి.
మనీలాండరింగ్ కేసులో సోరెన్‌కు ఈడీ తొమ్మిది సమన్లు పంపింది. వీటిని సోరెన్ విస్మరిస్తూనే వచ్చారు. దీంతో ఆయనపై ఉచ్చు మరింత బిగుసుకుంది. 10వ సమన్లను కూడా పట్టించుకోకుండా మాయమైన హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇక కేజ్రీవాల్ విషయానికివస్తే, ఆయన ఇప్పటివరకు ఐదు సమన్లను తిరస్కరించారు. దీనిని చూస్తుంటే కేజ్రీవాల్ ఈ సమన్లను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు ఎప్పుడూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగినవిగా కనిపిస్తుంటాయని, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారని పలువురు విశ్లేషిస్తుంటారు. ఒకవేళ ఈడీ బృందం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు వస్తే, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల్లో సానుభూతి కార్డ్ ప్లే చేస్తుందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇది పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది.
బీజేపీ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయనుందని ‘ఆప్’ నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. దీనికితోడు తనను ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ప్రకటించడం విశేషం. మద్యం కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో గత రెండేళ్లుగా దర్యాప్తు జరుగుతోందని, అయితే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈడీ తనను ఎందుకు పిలుస్తున్నదని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇది బీజేపీ రాజకీయ ప్రేరేపిత చర్య అని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను ప్రధాని నరేంద్ర మోదీతో పోటీ పడగలనని నిరూపించడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే, ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. అప్పుడు అది పార్టీకి కలివచ్చే అంశంగా మారుతుంది. మరోవైపు ఈ ఘటనతో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో కేజ్రీవాల్ తన సత్తాను నిరూపించుకోగలుగుతారు. అప్పుడు ఢిల్లీలో లోక్‌సభ సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్‌తో ‘ఆప్’ మరింతగా చర్చలు జరిపేందుకు అవకాశం ఏర్పడుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment