భోపాల్: హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల(కమల్ మౌలా మాస్క్) కాంప్లెక్స్‌లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సర్వే చేపట్టింది. తాజాగా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ సర్వే రిపోర్టును సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసింది.
సర్వే రిపోర్టు ప్రకారం.. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్‌తో తయారు చేయబడ్డ 31 నాణేలను గుర్తించారు. ఈ నాణేలు ఇండో-సస్సానియన్ (10-11వ శతాబ్దం), ఢిల్లీ సుల్తానేట్ (13-14వ శతాబ్దం), మాల్వా సుల్తానేట్ (15-16వ శతాబ్దం), మొఘల్ (16-18వ శతాబ్దం), ధార్ రాష్ట్రం (19వ శతాబ్దం), బ్రిటిష్(19-20వ శతాబ్దం)వారికి చెందినవిగా పేర్కొంది. మొత్తం 94 శిల్పాలు, శిల్పాల శకలాలు, నిర్మాణాలు బయటపడినట్లు పేర్కొంది.
బయటపడిన ఈ శిల్పాలు బసాల్ట్, పాలరాయి, మృదువైన రాయి, ఇసుకరాయి, సున్నపురాయితో తయారు చేయబడినట్లు తెలిపింది. ఈ శిల్పాలు హిందూ దేవుళ్లు వినాయకుడు, బ్రహ్మ, నరసింహ, భైరవలో పాటు పలు జంతువులు, మానవుల రూపంలో ఉన్నాయి. వాటితో పాటు సింహం, ఎనుగులు, గుర్రాలు, కుక్క, కోతి, పాము, తాబేలు, పక్షులతో కూడిన శిల్పాలను గుర్తించినట్లు తెలియజేసింది. పలు శాసనాలపై సంస్కృతం, ప్రాకృత భాష రాసి ఉన్నట్లు పేర్కొంది. వాటిపై విద్యావ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినట్లు సూచిస్తున్నాయి. మరోవైపు.. భోజ్ రాజు హాయాంలో అక్కడి విద్యాకేంద్రం ఉన్నట్లు ఏఎస్‌ఐ రిపోర్టు సూచిస్తోంది.
మార్చి 11న భోపాల్ హైకోర్టు భోజ్‌శాలలో సర్వే నిర్వహించాలని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది. మధ్య యుగానికి సంబంధించిన భోజ్‌శాల కాంప్లెక్స్ సరస్వతీ దేవీ ఆలయమని హిందువులు, కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంప్లెక్సులో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేస్తుండగా శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు పూర్తి సర్వే రిపోర్టును జూలై 15వరకు సమర్పించాలని ఏఎస్‌ఐని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు జూలై 22కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment