
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మ సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే రెండు నెలల వ్యవధిలో స్కూలు బోర్డు పరీక్షలు, మున్సిపల్ తదితర ఎన్నికలు షెడ్యూల్ మేరకే జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్లంతా వ్యాక్సిన్ రెండు డోసులు విధిగా వేసుకోవాలన్నారు. ‘‘ఇక రాత్రి కర్ఫ్యూలుండవు. షాపింగ్, సినిమా మాల్స్ పూర్తి సామర్థ్యంతో నడుస్తాయి. పెళ్లిళ్లు, వేడుకలను రాత్రిళ్లు కూడా జరుపుకోవచ్చు. వాటిలో పాల్గొనే వాళ్లంతా విధిగా రెండు డోసులూ వేసుకోవాలి. మాస్కు ధరించాలి.’’ అని వివరించారు.
దేశంలో 83,876 కేసులు
దేశవ్యాప్తంగా సోమవారం 83,876 కొత్త కరోనా కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. మరణాల్లో 515 కేరళలో, 66 మహారాష్ట్రలో జరిగాయి. ఒమిక్రాన్ విజృంభణ తర్వాత గత 32 రోజుల్లో రోజువారీ కరోనా కేసులు లక్ష కంటే తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,2,72,014కు, మరణాలు 5,02,874కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 11,08,938కి తగ్గాయి. కోవిడ్ రికవరీ రేటు 96,19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment