గదర్ ఆవిర్భవానికి కారణమైన ‘హిందుస్తానీ గదర్’ పత్రిక రచనలు నిప్పులు వెదజల్లేవి. పత్రిక మాస్ట్‌హెడ్ కింద క్యాప్షన్ ‘అంగ్రేజీ రాజ్ కా దుష్మన్ ’ (అంగ్లేయుల రాజ్యానికి శత్రువు) అని ఉండేదంటే ఈ పత్రిక స్వభావం అర్థం చేసుకోవచ్చు. భారత విముక్తికి సాహసోపేతులైన సైనికులు కావాలని ఆ పత్రిక ప్రకటించింది. ‘‘భారత్‌లో విప్లవానికి సైనికులు కావాలి. వీరి వేతనం : మృత్యువు, వెల : ఆత్మార్పణం, ఫించను: స్వేచ్ఛ, యుద్ధక్షేత్రం : భారత్’’ అని ప్రకటించిన గదర్ పత్రిక ఎందరో యువతను ఉర్రూతలూగించింది. మతాలతో తమకు పనిలేదని, తమ మతం దేశభక్తి అని పత్రికలో ప్రముఖులు చెప్పారు. 1913 నవంబర్‌లో పత్రిక తొలి సంచిక వెలువడింది. ‘‘ఈరోజు ప్రవాస గడ్డపై గదర్ (విప్లవం, తిరుగుబాటు) ఆరంభిస్తున్నాం. మన భాషలో చెప్పాలంటే ఇది బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా యుద్ధం. మన పేరు గదర్, మన వృత్తి గదర్. త్వరలో పెన్నులు, ఇంకుల స్థానంలో రైఫిళ్లు, రక్తం వస్తాయి’’ అని తొలిసంచికలో కర్తార్ సింగ్ పేర్కొన్నారు.
తిరుగుబాటు, పోరాటం
తొలి ప్రపంచయుద్ధం సందర్భంగా భారత్‌లో సాయుధ విప్లవం తీసుకువచ్చి స్వతంత్రం సాధించాలని గదర్ పార్టీ సభ్యులు భావించారు. ఇందుకోసం పలువురు ఇండియాకు తిరిగివచ్చారు. 1914లో కలకలం సృష్టించిన ‘కోమగట మరు’ ఓడ ప్రయాణం తరువాత, అమెరికాలో నివసిస్తున్న అనేక వేల మంది భారతీయులు తమ వ్యాపారాలను, గృహాలను విక్రయించి బ్రిటిషర్‌లను భారతదేశం నుండి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. చాలామంది గదర్ సభ్యులు ఆయుధాలను భారత్‌కు విప్లవ పోరాటం కోసం స్మగ్లింగ్ చేశారు.
తొలినుంచి గదర్ సభ్యుల ధోరణి దుందుడుకుగా ఉండేది. తమకు సైనికులు కావాలి కానీ పండితులు, ముల్లాలూ కాదన్న హర్నామ్ సింగ్ మాటలే ఇందుకు నిదర్శనం. పార్టీకి మెక్సికో, జపాన్, చైనా, సింగపూర్, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలయా, ఇండో–చైనా, తూర్పు ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా వంటి ఇతర దేశాలలో క్రియాశీల సభ్యులుండేవారు. అయితే వీరి తొలి ప్రయత్నం (గదర్ తిరుగుబాటు) విఫలమైంది. 42 మంది తిరుగుబాటుదారులను ప్రభుత్వం బంధించి, తమ చట్టాల ప్రకారం విచారించి మరణశిక్ష విధించింది.
తర్వాత కాలంలో గదరైట్లు అండర్‌గ్రౌండ్‌లో కార్యకలాపాలు నడిపారు. జర్మన్, ఒట్టోమన్ సహకారంతో స్వాతంత్య్రం సాధించాలని ప్రయత్నాలు చేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఇవి కూడా విఫలమయ్యాయి. వీటిపై అమెరికాలో విచారణ జరిపి పలువురు సభ్యులకు శిక్షలు విధించారు. ప్రపంచయుద్ధంలో బ్రిటన్ పక్షం విజయం సాధించడంతో పార్టీలో చీలికలు వచ్చాయి. తర్వాత కాలంలో గదర్ పార్టీ కమ్యూనిస్టు, సోషలిస్టు విభాగాలుగా విడిపోయింది. 1948లో అధికారికంగా పార్టీని రద్దు చేశారు. గదరైట్లు తామనుకున్న లక్ష్యం సాధించకపోయినా భారతీయుల్లో ముఖ్యంగా సాయుధ పోరాటం ద్వారా విముక్తి సాధ్యమని నమ్మే జాతీయవాదుల్లో నమ్మకం పెరిగేందుకు దోహదం చేశారు.
– దుర్గరాజు శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment