శునకాల స్వైర విహారం.. 11 జాతులపై నిషేధం.. ఎక్కడంటే! | Bans 11 Foreign Dog Breeds: Gurugram Consumer Forum Ordered | Sakshi
Sakshi News home page

శునకాల స్వైర విహారం.. 11 జాతులపై నిషేధం.. ఎక్కడంటే!

Published Thu, Nov 17 2022 8:21 PM | Last Updated on Thu, Nov 17 2022 8:23 PM

Bans 11 Foreign Dog Breeds: Gurugram Consumer Forum Ordered - Sakshi

ప్రమాదకరమైన వాటిగా గుర్తించిన 11 విదేశీ జాతి శునకాలను నిషేధించాలని ఫోరం ఉత్తర్వులిచ్చింది.

న్యూఢిల్లీ: ఇంటి భద్రత కోసం చాలా మంది శునకాలను పెంచుకుంటారు. పెట్స్‌ ను పెంచుకోవడాన్ని కొంతమంది స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. ఇదంతా బాగానే ఉన్నా పెంపుడు జంతువులతో యజమానులకు పెద్దగా సమస్యలు ఉండవు. కానీ శునకాల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. దీంతో కుక్కలంటేనే జనం వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.  


దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్‌లో శునకాల బెడద పెరిగిపోవడంతో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. 11 విదేశీ శునకాల జాతులను నిషేధించాలని, వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌(ఎంసీజీ)ని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక ఆదేశించింది. ఆగస్టు 11న సివిల్ లైన్స్‌లో డోగో అర్జెంటీనో జాతికి చెందిన కుక్క కాటుకు గురై తీవ్ర గాయాలపాలైన మహిళ.. తమను ఆశ్రయించడంతో వినియోగదారుల ఫోరం ఈ మేరకు నవంబర్‌ 15న ఉత్తర్వులు వెలువరించింది. బాధిత మహిళకు రూ. 2 లక్షలు చెల్లించాలని.. పెంపుడు కుక్కల కోసం మూడు నెలల్లో పాలసీని రూపొందించాలని ఎంసీజీని ఫోరం ఆదేశించింది.

ఈ 11 జాతులు ప్రమాదకరం..
ప్రమాదకరమైన వాటిగా గుర్తించిన 11 విదేశీ జాతి శునకాలను నిషేధించాలని ఫోరం ఉత్తర్వులిచ్చింది. అమెరికన్ బుల్‌డాగ్, అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్‌వీల్లర్, బోయర్‌బోయెల్, ప్రెస్ కానరియో, నియాపోలిషియన్ మాస్టిఫ్, వోల్ఫ్‌డాగ్, కేన్ కోర్సో, బాండోగ్, ఫిలా బ్రసిలీరో జాతి శునకాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. 

వాటి బాధ్యత యజమానులదే
పెంపుడు శునకాలకు సంబంధించి అమలు చేయాల్సిన అంశాలపై ఎంసీజీకి ఫోరం స్పష్టమైన సూచనలు చేసింది. ‘ప్రతి నమోదిత శునకానికి కాలర్‌ను ధరించాలి.. దానికి మెటల్ టోకెన్‌తో పాటు మెటల్ చైన్‌ను జతచేయాలి. ఒక కుటుంబం ఒక కుక్కను మాత్రమే పెంచుకునేలా చూడాలి. పెంపుడు శునకాలను బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లినప్పుడల్లా అవి ఎవరినీ కరవకుండా ఉండేందుకు వాటి మూతిని నెట్ క్యాప్ లేదా మరేదైనా వస్త్రంతో కవర్‌ చేయాలి. బహిరంగ ప్రదేశాలను పాడు చేయకుండా చూడాల్సిన బాధ్యతను యజమానులదేన’ని 16 పేజీల ఉత్వర్తుల్లో పేర్కొంది.

పసిపాపపై కుక్క దాడి.. విషాదం
గురుగ్రామ్‌లో శునకాల స్వైర విహారంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నెలలో వీధి కుక్క దాడిలో ఓ పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కాగా, పిట్ బుల్, రోట్‌వీలర్, డోగో అర్జెంటినో అనే మూడు జాతుల కుక్కల పెంపకంపై నిషేధం విధించే ప్రతిపాదనను ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్టోబర్‌లో ఆమోదించింది.

జంతు ప్రేమికుల ఆందోళన
విదేశీ సంతతికి చెందిన 11 జాతి శునకాలపై నిషేధం విధించడాన్ని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శునకాల్లో ప్రమాదకరమైనవి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని..  పరిస్థితులను బట్టి మూగజీవాలు స్పందిస్తాయని నిహారిక కశ్యప్‌ అనే జంతు పరిరక్షణ కార్యకర్త తెలిపారు. కుక్కలను ఎక్కువసేపు బంధించి ఉండచం, వాటికి సమయానికి ఆహారం పెట్టకపోవడం వంటి కారణాలతోనే అవి అదుపు తప్పుతాయని వివరించారు. సమస్య పరిష్కారానికి కారణాలు గుర్తించకుండా కొన్ని జాతి శునకాలపై నిషేధం విధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. విదేశీ శునకాలను అధిక మొత్తానికి విక్రయించి సొమ్ములు చేసుకుంటున్న వ్యాపారులపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. (క్లిక్‌: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement