
నవరంగపూర్–నందాహండి మార్గంలో ఎలుగుబంట్లు
భువనేశ్వర్ : నవరంగపూర్ జిల్లాలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నవరంగపూర్–నందాహండి మార్గంలో నాలుగు ఎలుగుబంట్లను ఆ ప్రాంత ప్రజలు చూశారు. అవి రహదారిపై తిరుగుతూ ఉండడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎలుగుబంట్లు తమపై ఎక్కడ దాడికి పాల్పడతాయోనన్న భయంతో పలువురు పరుగులు తీసినట్లు సమాచారం. గత ఏడాది ఇదే సమయంలో ఈ మార్గంలోని సిందిగుడ ప్రాంతంలో ఒక వృద్ధునిపై ఎలుగుబంటి దాడిచేసి చంపిన ఉదంతాన్ని నేటికీ ప్రజలు మరువలేదు. ఇప్పుడు ఒకేసారి నాలుగు ఎలుగుబంట్లు రావడంతో భయాందోళన చెందిన ప్రజలు వెంటనే అటవీ విభాగ అధికారులు ఎలుగుబంట్లను అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.