
బెంగళూరు: జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన మహిళ వీడియో ఒకటి సుమారు పదిరోజుల కిందట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతోనే మృతి చెంది ఉంటారని పోలీసులు, అంతా ప్రాథమికంగా భావించారు. అయితే ఆమెది గుండెపోటు మరణం కాదని వైద్యులు ఇప్పుడు ధృవీకరించారు.
ఈమధ్యకాలంలో ఉన్నపళంగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వాటిలో చాలావరకు ఫిట్‌నెస్‌కు ముడిపడి ఉండడంతో.. జిమ్‌లంటేనే వణికిపోతున్నారు చాలామంది. ఈ తరుణంలో కర్ణాటక మహిళ హఠాన్మరణం సైతం ఆ ప్రచారానికి ఆజ్యం పోసింది. అయితే.. 44 ఏళ్ల వినయకుమారి విట్టల్ మరణం వెనుక గుండె పోటు కారణం కాదని వైద్యులు ధృవీకరించారు. ఆమె మరణానికి కారణం బ్రెయిన్ ఎటాక్ అని శవపరీక్షలో వైద్యులు గుర్తించారు.
మెదడులోని రక్తనాళం పగిలి ఆమె మరణించారట. ఇందుకు సంబంధించిన ఆటాప్సీ రిపోర్ట్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మెదడులో ఉబ్బిన రక్తనాళము పగిలి పోవడం వల్ల రక్తస్రావం జరిగి.. కోమా వెనువెంటనే మరణం సంభవించింది అని ఉంది ఆ నివేదికలో. కాబట్టి, జిమ్‌లకు వెళ్తున్న వాళ్లు.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల.. రక్తపోటు స్థాయిలు పెరగడంతో పాటు మరణానికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఘటన వివరాలు..
మంగళూరు మల్లేశ్వపాళ్యంలో నివాసం ఉండే వినయకుమారి (44).. సీవీ రామ్‌నగర్ జీఎం పాల్యాలోని ఓ జిమ్ సెంటర్‌లో మార్చి 26న ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే పక్కనున్నవారు ఆమెను రక్షించాలని ప్రయత్నించినా.. క్షణాల వ్యవధిలోనే ఆమె కన్నుమూసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వినయకుమారి ఓ ప్రైవేట్‌సంస్థలో పని చేస్తోంది. ఆమె అవివాహితురాలు. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment