
అధికార బీజేపీ దేశంలో హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తోందని, కానీ, మన దేశం ఎల్లప్పుడూ..
ఫతేగఢ్ సాహిబ్ (పంజాబ్): అధికార బీజేపీ దేశంలో హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి దుయ్యబట్టారు. ‘‘కానీ మన దేశం ఎప్పుడూ ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచింది. అందుకే భారత్ జోడో యాత్ర ఇంతగా విజయవంతమవుతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఆయన యాత్ర బుధవారం పంజాబ్‌లోకి ప్రవేశించింది.
ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాను సందర్శించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ మతాలను, కులాలను పరస్పరం ఎగదోస్తూ దేశ వాతావరణాన్నే కలుషితం చేశాయంటూ ధ్వజమెత్తారు. అందుకే దేశానికి ప్రేమ, ఐక్యతలతో కూడిన మరో దారి చూపాలనే యాత్ర మొదలు పెట్టినట్టు చెప్పారు. మీడియా కూడా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి పెను సమస్యలను పక్కన పెట్టి 24 గంటలూ ప్రధాని మోదీని చూపించడానికే పరిమితమవుతోందంటూ చురకలంటించారు.
21 పార్టీలకు ఆహ్వానం
భారత్ జోడో యాత్ర జనవరి 30న జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా జరిపే ముగింపు సభలో పాల్గొనాలని కోరుతూ 21 పార్టీల అధ్యక్షులకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖలు రాశారు.