పట్నా: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరిగుతోంది. ఈ విషయంలో జనాలకు మద్దతుగా ఉండాల్సిన రాజకీయ నాయకులు తలకు మాసిన కామెంట్లు చేస్తూ.. ప్రజాగ్రహాన్ని మరింత పెంచుతున్నారు. తాజాగా బిహార్ బీజేపీ మంత్రి ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంధన ధరలు పెరిగినా సామాన్యుల మీద పెద్దగా భారం పడదు.. ఎందుకంటే వారు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కువగా వాడతారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వివరాలు.. బిహార్ మినిస్టర్ నారాయణ్ పటేల్ పెరిగిన ఇంధన ధరలపై స్పందిస్తూ... ‘‘సామాన్యులు ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థ మీద ఆధారపడతారు. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రైవేట్ వాహనాలు వాడతారు. కాబట్టి ఇంధన ధరల పెంచినప్పటికి వారి మీద పెద్దగా ప్రభావం పడదు. పెరిగిన ధరలకు నెమ్మదిగా వారే అలవాటు పడతారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు తప్ప సామాన్యులు కార్లు వాడకపోవడం ఉత్తమం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నారాయణ్ పటేల్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పెట్రో ధరల పెంపుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్ మీద వచ్చిన సంగతి తెలిసిందే.
పెట్రో ధరల పెంపు పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో ఉత్పత్తి కోతలను తగ్గించాలని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎగుమతి దేశాల (ఒపెక్), అనుబంధ చమురు ఉత్పత్తిదారులను కోరారు. అంతకుముందు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ప్రధాన్, కరోనావైరస్ మహమ్మారి కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఇంధన ఉత్పత్తి తగ్గిందని.. అందువల్లే ధరల పెరిగాయని ఆరోపించారు. తక్కువ ఉత్పత్తి డిమాండ్.. సరఫరాలో అసమతుల్యతకు కారణమైందన్నారు.
చదవండి:
కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి
అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment