
భోపాల్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. కంటికి కనబడని ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక బీజేపీ ఎంపీ చేసిన పని వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్ ఎంపీ, మాజీ మేయర్ అలోక్ శర్మ కోవిడ్‌తో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించే ‘ముక్తి వాహనం’ ముందు నిలబడి ఫోటోలకు పోజిచ్చారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పైగా తన ఫొటోషూట్ కోసమే ఈ వాహనాలను చాలా సేపు ఆపారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు నరేంద్ర సలుజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచనమైన చర్యకు పాల్పడినందుకు సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా దీన్ని చూసిన నెటిజన్లు సైతం బీజేపీ ఎంపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు.