ఢిల్లీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పురోగతిపై భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి నెలాఖరులోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 10 నాటికి అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తికానుండగా, రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలు 15 నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత జనవరి నెలాఖరు కల్లా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో గత ఏడాది కాలంగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన పురోగతిపై అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నుంచి నివేదిక తీసుకున్నారు.
అంతేగాక పార్టీ అంతర్గత ఎన్నికలపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, పార్టీ జాతీయ పదాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి డి.పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు.
నడ్డా దిశా నిర్దేశం
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని ఏడాది పొడవునా నిర్వహించడం, దేశంలోని వివిధ ప్రదేశాలలో అటల్‌జీ జీవితానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించడంపై నడ్డా దిశానిర్దేశం చేశారు. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, విజయాలు, ప్రధానంగా కార్గిల్ యుద్ధం, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, పోఖ్రాన్ అణు పరీక్ష, స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి ప్రాజెక్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి విజయాలను ప్రదర్శించనున్నారు. ఇలావుండగా వివాదాస్పద అంశాలపై ప్రకటనలు, వ్యాఖ్యలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment