సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో 227 వార్డులుండాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో 236 వార్డులుండాలని దాఖలుచేసిన రెండు పిటిషన్లను తిరస్కరించింది. ఫలితంగా హైకోర్టులో మహా వికాస్ అఘాడీకి గట్టి దెబ్బ తగిలినట్‌లైంది.
అంతేగాకుండా హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహా వికాస్ అఘాడీ సుప్రీంకోర్టును ఆశ్రయించని పక్షంలో ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన, ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తదితర ప్రక్రియ పూర్తిచేయాలి. దీన్ని బట్టి బీఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అక్టోబరులో లేదా నవంబరులో అంటే దీపావళిలోపు బీఎంసీ ఎన్నికల నగారా మోగే అవకాశముంది.
అఘాడీ ప్రభుత్వంలోనే నిర్ణయం
రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఎంసీ వార్డుల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందుకు వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ముంబై సిటీ, పశ్చిమ ఉపనగరం, తూర్పు ఉపనగరంలో మూడు చొప్పున ఇలా తొమ్మిది వార్డులు పెరిగాయి. కానీ వార్డుల హద్దులన్నీ తారుమారయ్యాయి. ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలన్నీ మరో వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్ల అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఏక్‌నాథ్ షిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంవల్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది.
ఆ తరువాత షిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2022 జూన్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మహా వికాస్ అఘాడీ తీసుకున్న 236 వార్డుల పెంపు నిర్ణయాన్ని రద్దు చేసింది. 2017లో జరిగిన జనగణన ప్రకారం 227 వార్డులు ఉండాలని షిందే, ఫడ్నవీస్ మంత్రివర్గం తీర్మానించింది. కానీ 227 ఉంచాలని షిందే, ఫడ్నవీస్ మంత్రిమండలి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు రాజు ఫడ్నేకర్, సమీర్ దేశాయ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎస్.బి.శక్రే, ఎం.డబ్ల్యూ చాంద్‌వాని బెంచి ఇరువురు సమర్పించిన పిటిషన్లను కొట్టివేసింది.
మూడోసారి వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వార్డుల రిజర్వేషన్ లాటరీ జాబితాను ఇదివరకు రెండుసార్లు రద్దు చేయాల్సి వచి్చంది. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పుతో మూడోసారి వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మొదటిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం 2021, మే 31న వార్డుల రిజర్వేషన్ లాటరీ వేసింది. ఆ తరువాత ప్రత్యేక వెనకబడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో జూలై 29న మళ్లీ కొత్తగా వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 227 వార్డులు ఉంచాలని షిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మూడోసారి వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
2021 జనగణన జరగకుండా వార్డుల సంఖ్య పెంపు ఎలా?
బీఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య 2001లో జరిగిన జనగణన ప్రకారం 227 ఉండాలని నిర్ణయించారు. కానీ 2011లో చేపట్టిన జనగణనలో జనాభా పెరిగినప్పటికీ కార్పొరేటర్ల సంఖ్య పెంచలేదు. కాగా 2001 నుంచి 2011 మధ్య కాలంలో ముంబైలో జనాభా 3.87 శాతం పెరిగింది. దీంతో పెరిగిన జనాభా, పెరిగిన నగర విస్తరణను పరిగణంలోకి తీసుకుని కార్పొరేటర్ల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముంబై సిటీ, పశి్చమ, తూర్పు ఉప నగరాల్లో మూడు చొప్పున మొత్తం 9 వార్డులు పెంచింది. కానీ వార్డుల సంఖ్య పెంచాలంటే తాజాగా అంటే 2021లో చేపట్టిన జనగణనను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2021లో జనగణన జరగనే లేదు.
ఇక 9 వార్డులు పెంచాల్సిన అవసరమేముందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అనేక సార్లు ప్రశ్న లేవనెత్తింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ పూర్తిచేసి జాబితా కూడా విడుదల చేసింది. ఆ తరువాత ఓబీసీ రిజర్వేషన్ అమలు కావడంతో రెండోసారి లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచి్చంది. చివరకు ఏక్‌నాథ్ షిందే తిరుగుబాటు చేసి శివసేన నుంచి బయటపడటం, ఆ తరువాత నాటకీయ పరిణాల మధ్య షిందే ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో మçహా వికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి ఎప్పటి లాగే వార్డుల సంఖ్య 227 ఉంచాలని నిర్ణయం తీసుకుంది.
వార్డుల సంఖ్య తగ్గింపు శివసేనపై ప్రభావం
వార్డుల సంఖ్య 236 నుంచి 227కు తగ్గడంవల్ల దీని ప్రభావం శివసేనపై చూపనుంది. వార్డుల పునరి్వభజన, తొమ్మిది వార్డులు తగ్గిపోవడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో వివిధ పారీ్టలతో పోలిస్తే శివసేనకు ఎక్కువ శాతం నష్టం వాటిళ్లే ప్రమాదముంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తొమ్మిది వార్డులు పెంచాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయంతో వార్డులను పునర్విభజన చేశారు.
మొత్తం 236 వార్డుల్లో అధిక శాతం శివసేనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమరి్థంచడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. 2017 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాలు మారడంతో ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment