
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్‌ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఉద్దవ్ వెంట ఉన్న శివసేన కార్యకర్తలు ఒక్కొక్కరుగా సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలోకి వెళ్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ముంబైలో ఉద్దవ్ థాక్రే, ఆదిత్యా థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన దాదాపు 3000 మంది శివసేన, ఉద్దవ్ థాక్రే మద్దతుదారులు ఆదివారం సీఎం షిండే వర్గంలో చేరారు. అయితే, ముంబైలో దసరా సందర్భంగా తన మద్దతుదారులతో ర్యాలీ చేసేందుకు థాక్రే.. ముంబై హైకోర్టు నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్దవ్ మద్దతుదారులు ఇలా హ్యాండిచ్చి.. షిండే వర్గంలో చేరడంతో ఊహించని విధంగా షాక్ తగిలినట్టు అయ్యింది.
మరోవైపు.. ముంబైలోని వర్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచే ఆదిత్య థాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కాగా, తాజా పరిణామం కారణంగా ఆదిత్య థాక్రేకు సైతం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఇటీవలే శివసేన గుర్తు గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ థాక్రే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
3000 Shiv Sena members from Mumbai’s Worli join Eknath Shinde faction
— News7 India (@news7indialive) October 2, 2022
>> Watch Now https://t.co/7yfDzFmdS2
#3000 #Shiv #Sena #members #News #NewsUpdate #LatestNews #TodayNews #BreakingNews #Trending #TrendingNews #Headlines pic.twitter.com/kSJzDiPw0R