సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించనుందన్న అంచనాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈనిర్ణయాన్ని సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగాలు తొలగిపునకు సంబంధించి సెప్టెంబర్ 1న బీఎస్ఎన్ఎల్ తన మానవ వనరుల డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు యూనియన ఆరోపించింది. ఈ క్రమంలో మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటికే 30వేలమంది కార్మికులను తొలగించిందనీ, వీరికి ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాలని యూనియన్ ఆరోపించింది. ఈ విషయంలో సంస్థ తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థికపరిస్థితి క్షీణించిందని, దీంతోపాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్‌వర్క్‌లలో లోపాలు పెరిగాయంటూ బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి కె పూర్వర్‌కు యూనియన్ ఒక లేఖ రాసింది.మరోవైపు 900 కోట్ల రూపాయల విలువైనపెండింగ్ బకాయిలను బీఎస్‌ఎన్‌ఎల్ చెల్లించకపోతే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని గతనెలలో ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ నోకియా హెచ్చరించింది.
కరోనావైరస్ మహమ్మారి మధ్య ఖర్చు తగ్గించే చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ తెలిపింది. కాగా నష్టాల్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ రెండు సంస్థలను విలీనం చేయడం, ఆస్తులను మోనటైజ్ చేయడం, ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ఇవ్వడం లాంటి చర్యలను ప్రకటించింది. ఇందుకు 2019 అక్టోబర్‌లో 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment