యశవంతపుర: ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఇంజినీరింగ్ విద్యారి్థని హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దిబ్బూరు గ్రామంలోని ప్రెసిడెన్సీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న కోలారుకు చెందిన లయస్మితను మరో కళాశాలలో చదువున్న పవన్ అనే యువకుడు హత్య చేశాడు. నిందితుడిని లయస్మిత మేనత్త కొడుకుగా పోలీసులు గుర్తించారు. ప్రేమను నిరాకరించిందనే ఆక్రోశంతోనే ఘోరానికి తెగబడ్డాడని తేలింది.
మరో విద్యార్థి ఐడీ కార్డుతో కళాశాలలోకి ప్రవేశం
ఇతరులు కాలేజీలోనికి వెళ్లటానికి అవకాశంలేదు. హత్య చేసిన పవన్ ఎలా లోపలకు వెళ్లాడనే విషయంపై అరా తీయగా మరో విద్యార్థి ఐడీ కార్డును ఉపయోగించుకుని కాలేజీలోకి వెళ్లాడు. ప్రెసిడెన్సీ కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు సహకరించటం వల్ల లోపలకు వెళ్లి హత్య చేసినట్లు విచారణలో తెలిసింది. మధ్యాహ్నం 12:30 గంటలకు కాలేజీ గేట్‌వద్దకు వెళ్లాడు. అక్కడ మరో విద్యార్థిని పరిచయం చేసుకున్నారు. అతడి కాలేజీ ఐడీతో లోపలకు వెళ్లి లయస్మిత తరగతి గది వద్దకు వెళ్లాడు.
ఆమె గది నుంచి బయటకు వస్తుండగానే కత్తితో గుండెపై పొడిచాడు. అయితే నిందితుడి వద్ద ఉన్న ఐడీ కార్డు ఎవరిదనే విషయంపై పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే లయస్మిత తండ్రి నాగరాజు మూడు నెలల క్రితమే మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు. లయను ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment