యూపీ సీఎం బాటలో ఎంపీ సీఎం.. నిందితుని ఇంటిపైకి బుల్డోజర్‌! | Bulldozer Action Against Murder Accused House In Madhya Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

యూపీ సీఎం బాటలో ఎంపీ సీఎం.. నిందితుని ఇంటిపైకి బుల్డోజర్‌!

Published Sat, May 25 2024 9:20 AM

Bulldozer Action Against Muder Accused House

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్ర పాలనలో అనుసరిస్తున్న విధానాలను ఇప్పుడు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ ఫాలో చేస్తున్నారు. ఇందు తాజాగా ఒక ఉదాహరణ మన ముందుకొచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో మైనర్ బాలిక హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటిపైకి ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్‌ దూసుకెళ్లింది. నిందితుని ఇంటిని బుల్డోజర్‌ సాయంతో పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఈ ఉదంతం బిర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోహ్ మేట్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన స్నేహితునితో కలిసి మేటీ గ్రామానికి చెందిన మైనర్ బాలికను హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక నర్సరీలో పడేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆ బాలిక అమ్మమ్మ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఒక బావిలో లభ్యమైంది. ఈ కేసులో ఆ బాలిక (మృతురాలు) కోర్టులో మే 17న సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, ఇంతలోనే హత్యకు గురయ్యింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనాభివృద్ధి మండలి నిందితులను ఉరితీయాలని, వారి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయాలని డిమాండ్‌ చేసింది.

ఈ నేపధ్యంలో నిందితుని తండ్రి యశ్వంత్‌కు చెందిన ఇంటిని అధికారులు కూల్చివేశారని తహసీల్దార్‌ రాజు నామ్‌దేవ్‌ తెలిపారు. ఆ ఇంటిని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలికను వేధించడం, హత్య చేయడం లాంటి దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని నామ్‌దేవ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement