జూన్ 5.. అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. నేటితో ఆయనకు 52 ఏళ్లు నిండాయి. దేశంలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా యోగి ఆదిత్యనాథ్‌కు పేరుంది. అభిమానులు ఆయనను యోగి బాబా, బుల్డోజర్ బాబా అని కూడా పిలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ రెండుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా కూడా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలో జన్మించారు. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్. యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ ఫారెస్ట్ రేంజర్. సీఎం యోగి గణితంలో బీఎస్సీ పట్టా పొందారు. 1990లో ఏబీవీపీలో చేరారు. 1993లో గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ అద్వైత్‌నాథ్‌తో పరిచయం ఏర్పడింది. 1994లో అజయ్ సింగ్ బిష్త్ సన్యాసం స్వీకరించారు. నాథ్ శాఖకు చెందిన సాధువుగా మారారు. ఆ తర్వాత ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్‌గా మారింది. 1994లో అద్వైత నాథ్ తన వారసునిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రకటించారు.
యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ టికెట్‌పై తన 26 ఏళ్ల వయసులో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1999, 2004, 2009, 2014లలో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. మహంత్ అద్వైత్‌నాథ్ 2014లో కన్నుమూశారు. అనంతరం యోగి గోరఖ్‌నాథ్ పీఠానికి అధ్యక్షులయ్యారు.
2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితాలు వెలువడే సమయంలో యోగి ఆదిత్యనాథ్ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు ఎన్నికల ఫలితాల విడుదల వరకూ ఆగాలని ఆయనను కోరారు. ఆ సమయంలో మనోజ్ సిన్హా, కేశవ్ మౌర్య సహా పలువురు బీజేపీ నేతలు సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అయితే బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యనాథ్‌ను ఢిల్లీకి పిలిపించి, యూపీలో అధికారం చేపట్టాలని కోరింది.
యోగి సీఎం పదవి చేపట్టగానే ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతలు. దీనికి పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ఆయన పోలీసు అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. యోగి నాయకత్వంలో 2022లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించింది. సీఎం యోగి బుల్డోజర్లతో నేరస్తుల ఇళ్లపై దండెత్తాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. అందుకే ఆయనకు బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చిందంటారు.
Comments
Please login to add a commentAdd a comment