న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని చూపుతున్న అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఉదంతం కేంద్రానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశ రాజధానిలోని ఆప్ నేత, ఢిల్లీ విద్యా, ఎక్సైజ్ శాఖల మంత్రి మనీశ్ సిసోడియా నివాసంపై సీబీఐ శుక్రవారం దాడులు చేసింది. గురుగ్రాం, చండీగఢ్, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ, బెంగళూరు... ఇలా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 చోట్ల ఉదయం 8 గంటల నుంచి రాత్రి దాకా ఏకకాలంలో దాడులు చేసింది.
మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో సోదాలు చేసింది. రాత్రి 11 గంటల దాకా సిసోడియా నివాసంలో సోదాలు కొనసాగాయి. తన లాప్‌టాప్, ఫోన్ తీసుకెళ్లారని ఆయన మీడియాకు తెలిపారు. పలు పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. ఈ ఉదంతంపై బుధవారమే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. సిసోడియా, నలుగురు ప్రభుత్వాధికారులతో పాటు మొత్తం 15 మందిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీబీఐ అభియోగాలు మోపింది.
‘‘సిసోడియా తదితరులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ పాలసీలో పలు మార్పులు చేశారు. తద్వారా లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఖజానాకు రూ.144.36 కోట్ల మేరకు నష్టం చేకూర్చారు. బదులుగా భారీగా ముడుపులు అందుకున్నారు’’ అని ఆరోపించిది. ఈ ఉదంతంపై ఆప్ మండిపడింది. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు జరిగాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో ఢిల్లీ సర్కారుకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తుండటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో కథనం ప్రచురించిన రోజే సీబీఐని ఉసిగొల్పారన్నారు.
‘‘స్వతంత్ర భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా శాఖ మంత్రిపై కక్షపూరిత చర్యలకు దిగారు. సీబీఐకి మేం పూర్తిగా సహకరిస్తాం. మా మంత్రులపై గతంలో చేసిన దాడుల్లో తేలిందేమీ లేదు. ఇప్పుడూ తేలేదేమీ లేదు’’ అంటూ ట్వీట్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని జత చేశారు. ‘‘మంచి చేయబోయిన వారందరినీ 75 ఏళ్లుగా ఇలాగే వెనక్కు లాగుతున్నారు. ఇందుకే దేశం వెనకబడింది. ఎవరేం చేసినా ఢిల్లీలో మాత్రం అభివృద్ధి ఆగదు’’ అన్నారు. ఇలాంటి దాడులకు బెదిరేది లేదని సిసోడియా అన్నారు. ‘‘సీబీఐకి స్వాగతం. ఈ కుట్రలు నన్నేమీ చేయలేవు. నిజం నిలకడ మీద తేలుతుంది’’ అంటూ ట్వీట్ చేశారు.
మోదీ సర్కారుకు దడ
కేజ్రీవాల్‌కు, ఆయన ఢిల్లీ మోడల్ పాలనకు సర్వత్రా పెరుగుతున్న పాపులారిటీని చూసి మోదీ ప్రభుత్వం బెదిరిపోతోందని ఆప్ ఆరోపించింది. సిసోడియా ఇంట్లో సీబీఐకి జామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు తప్ప మరేమీ దొరకవంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చెణుకులు విసిరారు. సిసోడియాను ఎలాగైనా కటకటాల్లోకి నెట్టాలని సీబీఐకి ఆదేశాలున్నాయని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. వీటిని బీజేపీ తిప్పికొట్టింది. ఎక్సైజ్ మంత్రి కాస్తా ఎక్స్‌క్యూజ్ మంత్రిగా
మారారంటూ కేంద్ర సమాచార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను మే 30న ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు.
ఏమిటీ కేసు?
2021 నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగేలా గోల్‌మాల్ చేశారంటూ ఆరోపణలొచ్చాయి. వీటికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదించారు. దాంతో సీబీఐ దర్యాప్తుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో ఆదేశించారు. పలువురు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీని గత నెలలో ఢిల్లీ సర్కారు పక్కన పెట్టింది. ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే...
► లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండానే లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి కలిగే పలు నిర్ణయాలను ఎక్సైజ్ మంత్రి సిసోడియా తీసుకున్నారు.
► కరోనాతో అమ్మకాలు తగ్గాయనే సాకుతో లైసెన్సు ఫీజులో ఏకంగా రూ.144.36 కోట్ల మేరకు రాయితీ ఇచ్చారు.
► లైసెన్స్ ఫీజు రాయితీ/తగ్గింపు, అనుమతి లేకుండానే ఎల్–1 లైసన్సు పొడిగింపు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
► ఈ గోల్‌మాల్‌లో విజయ్‌నాయర్, మనోజ్ రాయ్, పెర్నాడ్‌రిచర్డ్, అమన్‌దీప్ ధాల్, సమీర్ మహేంద్రు తదితర మద్యం లైసెన్సుదారులు, వ్యాపారుల పాత్ర ఉంది.
► వారి నుంచి సిసోడియా సన్నిహితులకు నుంచి కోట్లలో ముడుపులందాయి. మహేంద్రు వారికి రెండు విడతల్లో కోట్లు చెల్లించారు.
► సిసోడియాకు అతి సన్నిహితులైన అమిత్ అరోరా, దినేశ్ అరోరా, అర్జున్ పాండే వసూళ్లకు పాల్పడ్డారు.
► దినేశ్ అరోరాకు చెందిన రాధా అసోసియేట్స్ కు మహేంద్రు నుంచి రూ.కోటి అందింది.
► విజయ్ నాయర్ తరఫున మహేంద్రు నుంచి పాండే కూడా రూ.2 నుంచి 4 కోట్ల దాకా వసూలు చేశారు.
► మహేంద్రు నుంచి అరుణ్ రామచంద్ర పిళ్లై లంచాలు వసూలు చేసి నిబంధనల తారుమారుకు సాయపడ్డ ప్రభుత్వాధికారులకు ఇచ్చారు.
హైదరాబాద్ వ్యాపారిపైనా..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసాలు, కార్యాలయాల్లోనూ సీబీఐ దాడులు చేసింది. హైదరాబాద్ కోకాపేటతో పాటు బెంగళూరులో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. అరుణ్ రామచంద్ర పిళ్లై బెంగళూరు కేంద్రంగా స్పిరిట్, డిస్టిలరీస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయనపైనా ఆరోపణలున్నాయి.
కాకరేపిన కథనం
ఢిల్లీ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక గురువారం తన అంతర్జాతీయ ఎడిషన్లో మొదటి పేజీలో ప్రముఖంగా కథనం ప్రచురించింది. ‘‘ఆప్ పాలనలో ఢిల్లీ విద్యా విధానంలో సమూలమైన మౌలిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వాటిలో చేరేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు’’ అంటూ ప్రశంసించింది. ఇతర రాష్ట్రాలు కూడా ఢిల్లీ మోడల్ విద్యా విధానంపై దృష్టి పెట్టాయని పేర్కొంది. విద్యార్థినులతో సిసోడియా ఉన్న ఫొటోను కూడా ప్రచురించింది. ఆకస్మిక పర్యటనలు తదితరాల ద్వారా విద్యా మంత్రిగా ఆయన బాగా పని చేస్తున్నారని రాసింది. బీజేపీ, ఆప్ మాటల యుద్ధానికి ఈ కథనమే ప్రధాన ఆయుధంగా మారింది.
అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడాన్ని ఓర్వలేకే సిసోడియాపైకి మోదీ ఇలా సీబీఐని ఉసిగొల్పారని ఆప్ నేతలంతా ఆరోపించారు. ‘‘సిసోడియా ఫొటోను న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో వేసి మెచ్చుకుంది. కేంద్రం వెంటనే ఆయన ఇంటికి సీబీఐని పంపింది’’ అంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ తీరు సిగ్గుచేటని ఆప్ నేత సంజయ్ సింగ్ అన్నారు. బీజీపీ మాత్రం ఇది కచ్చితంగా ఆప్ డబ్బులిచ్చి రాయించుకున్న కథనమేనంటూ ఎదురుదాడికి దిగింది. ప్రచారం కోసం ప్రజా ధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించింది. ‘‘ఆప్ సర్కారు కీర్తి కండూతికి న్యూయార్క్ టైమ్స్ కథనమే తాజా ఉదాహరణ. ఈ కథనం అదే రోజు ఖలీజ్ టైమ్స్ అనే పత్రికలోనూ యథాతథంగా వచ్చింది’’ అంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
పెయిడ్ ఆర్టికల్ కాదు: న్యూయార్క్ టైమ్స్
పెయిడ్ ఆర్టికల్ ఆరోపణలను న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం తీవ్రంగా ఖండించింది. అది తాము క్షేత్రస్థాయిలో పరిశోధించి పూర్తి నిష్పాక్షికంగా రాసిన కథనమని స్పష్టం చేసింది. ఇదే కథనాన్ని ఖలీజ్ టైమ్స్ వార్తా పత్రిక కూడా అదే రోజు యథాతథంగా ప్రచురించడంపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను కొట్టిపారేసింది. ‘‘మా లైసెన్సున్న పలు వార్తా సంస్థలు మా కథనాలను ప్రచురించుకోవడం మామూలే’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment