సమ్మె విరమించిన వైద్యులు
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్యురాలి హత్యాచారం కేసు విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలిచి్చంది. అనంతరం గంటల వ్యవధిలోనే ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం హుటాహుటిన కోల్‌కతా చేరుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారించడమే గాక క్రైం సీన్‌ను రిక్రియేట్ చేయనుంది. మరోవైపు తమ ప్రధాన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో దేశవ్యాప్త సమ్మెను విరమిస్తున్నట్టు వైద్యులు ప్రకటించారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఓ ప్రబుద్ధుడు గత గురువారం రాత్రి ఓ ట్రైనీ డాక్టర్‌ను రేప్ చేసి దారుణంగా హతమార్చడం తెలిసిందే. దీనిపై వైద్యులు, వైద్య సిబ్బంది భగ్గుమన్నారు. ఇందులో ఇతరుల హస్తమూ ఉందని, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ పక్కాగా చెరిపేశారని ఆరోపించారు. దోషులందరికీ కఠిన శిక్షలు పడాలంటూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు తెర తీశారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిల్స్‌పై కలకత్తా ౖహైకోర్టు మంగళవారం విచారించింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. ఐదు రోజులు దాటినా ప్రగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.
ప్రిన్సిపల్ తీరు క్షమార్హం కాదు
ఈ ఉదంతంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తీరు దారుణమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం మండిపడ్డారు. ‘‘కాలేజీ క్యాంపస్ లోపల ఏకంగా మహిళా డాక్టర్‌ను రేప్ చేసి దారుణంగా హతమార్చినా ఆయన సత్వరం స్పందించలేదు. హత్య జరిగిందంటూ కనీసం సకాలంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. ఇది క్షమార్హం కాదు’’ అంటూ తీవ్రంగా తలంటారు. వైద్య విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఘోష్ రాజీనామా చేయడం తెలిసిందే. మమత సర్కారు దాన్ని ఆమోదించకపోగా ఆయనను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీ (సీఎన్‌ఎంసీహెచ్)కు బదిలీ చేయడంపై సీజే విస్మయం వెలిబుచ్చారు. తక్షణం సెలవుపై వెళ్లాలని ఘోష్‌ను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే దాకా ఇంటికే పరిమితం కావాలని స్పష్టం చేశారు.
డిమాండ్లకు కేంద్రం ఒప్పుకొంది: ఫోర్డా
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్స్ (ఫోర్డా) మంగళవారం రాత్రి ప్రకటించింది. ‘‘మంత్రితో భేటీ అయ్యాం. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు ఉద్దేశించిన కేంద్ర రక్షణ చట్టంపై ఫోర్డా సహకారంతో కమిటీ వేయాలనే ప్రధాన డిమాండ్‌ను 15 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు’’ అని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment