
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు(వేధింపుల నిరోధక) చట్టం–1989 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా టోల్–ఫ్రీ నంబర్ 14566 దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని సామాజిక న్యాయ, సాధికారత శాఖ ఆదివారం వెల్లడించింది. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.
వాయిస్ కాల్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) చేయవచ్చని తెలిపింది. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో సేవలు పొందవచ్చని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు ముగింపు పలికి, రక్షణ కల్పించేలా చట్టంపై అవగాహన కల్పించడమే హెల్ప్‌లైన్ ఉద్దేశమని వివరించింది. ప్రతి ఫిర్యాదును ఎఫ్‌ఐఆర్‌గా రిజిస్టర్ చేస్తామని, బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది.