ఛండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం ఛండీగఢ్‌లోని ప్రజలు 36 గంటల పాటు అంధకారంతో మగ్గిపోయారు. కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిపిపోవడంతో నీటి సరఫరా, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అయితే, ఎలక్ట్రిసిటీ విభాగాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఛండీగఢ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఛండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ లైట్లు వెలగలేదు. ఆన్‌లైన్ క్లాసులకు, ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఆసుపత్రుల్లో వైద్య సేవలను జనరేటర్ సాయంతో అందించినప్పటికీ కొన్ని శస్త‍్ర చికిత్సలను మాత్రం వాయిదా వేసినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, 36 గంటల పాటు కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన‍్లలో ఛార్జింగ్ లేక ప్రజలు పక్క నగరాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు క్యూ కట్టారు.
మరోవైపు విద‍్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఛండీగఢ్ పాలనా యంత్రాంగం రంగంలోకి దిగింది. విద్యుత్ విభాగంలోని ఉద్యోగులపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఆరు నెలల పాటు సమ్మెలు చేయకుండా నిషేధం విధించింది. ప్రభుత్వం ఎస్మా ప‍్రయోగించినప్పటికీ ఉద్యోగులు మాత్రం సమ్మె విరమించకపోవడం గమనార్హం. సిబ్బంది ఇప్పటికీ విధులకు హాజరు కాకపోవడంతో బుధవారం కూడా పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
కాగా, పంజాబ్, హర్యానా హైకోర్టు ‘విద్యుత్ సంక్షోభం’పై సుమోటో నోటీసును స్వీకరించింది. కేంద్రపాలిత ప్రాంత చీఫ్ ఇంజనీర్‌ను బుధవారం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment