న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్‌మెంట్‌లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధాను చంపిన 15, 20 రోజుల్లోనే అప్తాబ్ డేటింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసి యువతుకలు గాలం వేసేవాడని పోలీసులు పేర్కొన్నారు.
గతంలో అదే డేటింగ్ యాప్‌లో శ్రద్ధాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇలా మరో యువతితో పరిచయం పెంచుకొని.. ప్రియురాలి శవం ఫ్రిజ్‌లో ఉండగానే జూన్, జూలై నెలలో ఆమెను ఇంటికి పిలిపించినట్లు తెలిసింది. అయితే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. శ్రద్ధా శరీర భాగాలను అల్మారాకు తరలించేవాడని తెలిపారు.
అంతేగాక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పలువురు మహిళలను అతడు ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్, శ్రద్ధా శరీరాన్ని ముక్కలుగా చేసే ముందు రక్తపు మరకలు ఎలా శుభ్రం చేయాలో గూగుల్ చూసి నేర్చుకున్నట్లు, శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యుమన్ అనాటమీని చదివినట్లు పేర్కొన్నారు. క్రైం థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు చూసే అలవాటున్న అఫ్తాబ్.. అమెరికన్ వెబ్ సిరీస్ ‘డెక్సటర్’ ద్వారా ప్రేరణ పొంది శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు.
ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు అగర్‌బత్తీలు వెలిగించడం, ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసుకునేవాడు. త్వరగా చెడిపోతున్న శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా…ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు.
చదవండి: శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర!
శ్రద్ధా హత్య తెలియకుండా ఉండేందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ ఉపయోగించేవాడు. దాని నుంచి తన స్నేహితులకు మెసెజ్ చూస్తూ ఉండేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించేవాడు. అయితే రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ఆరు నెలలకు ఈ ఉదంతం బయటకు రావడం గమనార్హం. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నారు.
కాగా 24 ఏళ్ల శ్రద్ధాకు అఫ్తాబ్‌తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లు కలిసి జీవించారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ ఢిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి తీసుకురావడంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మే 18న మరోసారి ఇద్దిరి మధ్య గొడవ జరగడంతో శ్రద్ధను అత్యంత అమానుషంగా గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా కట్ చేసి పాడవకుండా ఉండేందుకు భారీ ఫ్రిజ్‌లో అమర్చాడు. తరువాత వాటిని ఒక్కొక్కొటిగా ఢిల్లీ నగరమంతా పారేశాడు.
Comments
Please login to add a commentAdd a comment