
న్యూఢిల్లీ: 10, 12వ తరగతుల మొదటి టర్మ్ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (ఐసీఎస్‌ఈ) శనివారం ప్రకటించింది. ఈ పరీక్షలకు సవరించిన తేదీలను కూడా వెల్లడించింది. ఐసీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 16 వరకు, 12వ తరగతి(ఐఎస్‌సీ) పరీక్షలు నవంబర్ 12వ తేదీన మొదలై డిసెంబర్ 20వ తేదీతో ముగుస్తాయని తెలిపింది.
ప్రత్యక్ష విధానంలో సంబంధిత స్కూళ్లలోనే నిర్వహించే ఈ పరీక్షలను మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. నవంబర్ 15, 16వ తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బోర్డ్ గత వారం ప్రకటించింది. ఆన్‌లైన్ పరీక్షలకు కావాల్సిన కంప్యూటర్లు, విద్యుత్, బ్యాండ్ విడ్త్ కొరత వంటి వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా వేసినట్లు తెలిపింది.