ముంబై: 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతకు సంబంధించి దేశ, విదేశాల్లోని విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నట్లు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌సీఈ)బోర్డు తెలిపింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ఐఎస్‌ఈసీ 10, 12వ తరగతి పరీక్షలు జరపాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ముంబై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐఎస్‌ఈసీ.. లాక్‌డౌన్ సమయానికి రాయగా మిగిలిన సబ్జెక్టులకు జూలైలో పరీక్షలు రాయడం లేదా ప్రి–బోర్డు పరీక్షలు/ అంతర్గత అంచనా ద్వారా మార్కులు వేసే విధానానికి అంగీకరించడం.. ఈ రెండింటిలో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందని తెలిపింది. ఈ విషయాన్ని స్కూళ్లకు తెలిపామని, విద్యార్థుల నుంచి ఆప్షన్లు అందాక ఆ మేరకు 22వ తేదీ కల్లా ఒక అంచనాకు వస్తామని పేర్కొంది. విద్యార్థుల ప్రి–బోర్డు పరీక్షల ఫలితాలు/అంతర్గత అంచనా మార్కులను ఇప్పటికే పాఠశాలల నుంచి తెప్పించుకున్నట్లు వెల్లడించింది. లాక్‌డౌన్ విధించడంతో 10, 12వ తరగతి ఫైనల్ పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో మిగిలిన పరీక్షలను జూలైలో జరిపేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment