కరోనా వైరస్‌ను చంపే మాస్క్‌ను అభివృద్ధి చేసిన ఇంటర్ స్టూడెంట్ దిగ్నాటికా బోస్ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
కోల్‌కతా: కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వాలు లాక్‌డౌన్ వంటి కఠిన ఆంక్షలు విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరిస్తూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు. ఇక కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి మాస్క్ తప్పనిసరి అయ్యింది. కరోనా నుంచి మనల్ని కాపాడే ఆయుధం మాస్కే అని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కోవిడ్ వైరస్‌ను చంపే మాస్క్‌ని అభివృద్ధి చేశారు. 12వ తరగతి విద్యార్థిని దీనిని అభివృద్ధి చేసింది. ఈ మాస్క్ కరోనాను చంపేస్తుందని విద్యార్థి పేర్కొంది.
ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ పుర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన దిగ్నాటికా బోస్ ఇంటర్ సెకడింయర్ చదువుతుంది. కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేయడం ఎలా అని ఆలోచించసాగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి విభిన్నమైన మాస్క్‌ను రూపొందించింది. ఈ మాస్క్ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తెలిపింది. దిగ్నాటిక ఆవిష్కరించిన ఈ మాస్క్‌ను ముంబైలోని గూగుల్స్ మ్యూజియం ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్‌లో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా దిగ్నాటిక మాట్లాడుతూ.. ‘‘నేను తయారు చేసిన ఈ మాస్క్‌లో మూడు చాంబర్లుంటాయి. మొదటి చాంబర్‌లో ఉండే అయాన్ జనరేటర్ గాలిలోని దుమ్ము కణాలను వడబోస్తుంది. ఇలా ఫిల్టర్ అయిన గాలి సెకండ్ చాంబర్ గుండా మూడో దానిలోకి ప్రవేశిస్తుంది. కెమికల్ చాంబర్‌గా పిలిచే దీనిలో సబ్బు కలిపిన నీరు ఉంటుంది. ఫిల్టర్ అయ్యి వచ్చిన గాలిలో ఉండే కరోనా వైరస్‌ను ఈ సబ్బు నీరు చంపేస్తుంది’’ అని తెలిపింది.
ఇక ‘‘కోవిడ్ పేషెంట్లు ఈ మాస్క్‌ను వినియోగిస్తే.. పైన చెప్పిన ప్రాసేస్ రివర్స్‌లో జరుగుతుంది. వారు వదిలిన గాలిలో కోవిడ్ క్రిములుంటాయి. థర్డ్ చాంబర్‌లోని సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పడు అవి చనిపోతాయి. ఆ తర్వాత వైరస్ రహిత గాలి మిగతా రెండు చాంబర్ల గుండా బయటకు వస్తుంది. దీని వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని తెలిపింది.
‘‘కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోమని ప్రచారం చేస్తున్నారు. అంటే సబ్బు నీరు కరోనాను చంపుతుందని అర్థం. దీని ఆధారంగా చేసుకుని నేను ఈ మాస్క్ అభివృద్ధి చేశాను. ట్రయల్స్ నిర్వహించడం కోసం త్వరలోనే రాష్ట్ర వైద్య శాఖ అధికారులను కలుస్తాను’’ అని చెప్పుకొచ్చింది దిగ్నాటిక. ఇక ఫస్ట్ లాక్‌డౌన్ విధించిన సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపిన దిగ్నాటిక.. తనకు అందుబాటులో ఉన్న వనరులతో దాన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించింది.
ఇక దిగ్నాటికాకు ఇలా విభిన్న ఆవిష్కరణలు చేయడం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. గతంలో ఆమె ఓ కళ్లజోడును తయారు చేసింది. దీన్ని ధరిస్తే.. తల వెనక్కు తిప్పకుండానే మన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇవి అడవిలోకి వెళ్లే వారికి బాగా ఉపయోగపడ్డాయి. వెనక నుంచి ఏవైనా క్రూరమృగాలు వస్తే గమనించడానికి సాయం చేశాయి. ఇప్పటికే దిగ్నాటికా మూడు సార్లు ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డ్ అందుకుంది. చెవులపై భారం పడకుండా ఉండేలా రూపొందించిన మాస్క్‌కు గాను మూడో సారి ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment