మీరు రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ అవసరమేమో.. కానీ నేను ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్లాలంటే ట్రాఫిక్ మొత్తం ఎక్కడిక్కడ నిలిచిపోవాల్సిందే. ఎవరైనా సరే నాకు దారి ఇవ్వాల్సిందే. అదీ నా లెవల్... అన్నట్లుగా ఉంది కదా దర్జాగా రోడ్డు మీద వెళ్తున్న ఈ పామును చూస్తుంటే! అవును.. నిజంగానే ఈ ప్రత్యేక అతిథి రోడ్డు దాటేందుకు సుమారు 30 నిమిషాల పాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపేశారు. కర్ణాటకలోని ఉడిపిలో గల కల్సాంకా జంక్షన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వాహనాల రద్దీ ఉన్న సమయంలో 10 అడుగులకు పైగా పొడవున్న పాము అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసు వెంటనే బండ్లను ఆపేశారు. పాము రోడ్డుకు ఆవలి వైపు వెళ్లేంతవరకు వేచి చూశారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. గురువారం నాటి ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వన్యప్రాణి పట్ల ట్రాఫిక్ పోలీసు వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment